● మాజీమంత్రి హరీశ్‌రావు ● కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఘన నివాళి
సిద్దిపేటకమాన్/చిన్నకోడూరు(సిద్దిపేట)/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): తెలంగాణ కోసం తన పదవిని సైతం త్యాగం చేసిన మహానీయుడు అందరికీ ఆదర్శప్రాయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని మాజీమంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా సిద్దిపేటలోని ఆయన విగ్రహానికి హరీశ్‌రావు ఆదివారం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ..అధికారం కంటే ఆశయమే ముఖ్యమని, తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలే ముఖ్యమని లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని దేశం కోసం పోరాడన్నారు. రెండవ దశ ఉద్యమం ప్రారంభమైనపుడు తన ఇంటిని టీఆర్‌ఎస్ పార్టీకి ఇచ్చి ఆశీర్వదించి, చేయూతనందించారని గుర్తు చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దొడ్డి కొమురయ్య, కొండా లక్ష్మణ్ బాపూజీ, చిట్యాల ఐలమ్మ, సర్వాయి సర్థార్ పాపన్న జయంతి, వర్థంతులను అధికారికంగా నిర్వహించిన ఘనత కేసీఆర్‌దే అని తెలిపారు.
రంగనాయక సాగర్‌ను పూర్తిస్థాయిలో నింపాలి
రంగనాయక సాగర్‌ను పూర్తిస్థాయిలో నింపి రైతుల పంట పొలాలకు సాగు నీరు అందించాలని హరీశ్‌రావు అన్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లోకి గోదావరి జలాల పంపింగ్‌ను సందర్శించారు. 24 గంటల పాటు మోటార్లు నడిపి రిజర్వాయర్‌లను నింపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నంగునూరు మండలంలోని నర్మెట గ్రామ శివారులోని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి గోదావరి జలాలు అంది నీటి కొరత తీరిందన్నారు.
క్రీడలతో ఆరోగ్యవంతమైన సమాజం
క్రీడలతో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మాజీమంత్రి ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యాసమహర్షి యోగా అసోసియేషన్ కార్యాలయంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం (పేట) జిల్లా శాఖ ఆధ్వర్యంలో వ్యాయామ విద్య ఉపాధ్యాయ పురస్కారాల కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. జిల్లాలో క్రీడలు, వ్యాయామ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న 16 మంది వ్యాయామ విద్య ఉపాధ్యాయులను సన్మానించి పురస్కారాలు అందించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ..సిద్దిపేటలో క్రికెట్ స్టేడియం, స్విమ్మింగ్ పూల్, అథ్లెటిక్స్ ట్రాక్, షటిల్ బ్యాడ్మింటన్ తదితర క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు తోట సతీశ్ తదితరులు పాల్గొన్నారు.


