డివిజన్ వ్యవసాయాధికారి బాబూనాయక్
కొండపాక(గజ్వేల్): నానో యూరియాలో నత్రజని పోషకం ఎక్కువ శాతం ఉంటుందని గజ్వేల్ డివిజన్ వ్యవసాయాధికారి బాబూనాయక్ పేర్కొన్నారు. కుకునూరుపల్లి మండలంలోని మేదినీపూర్ గ్రామంలోని పత్తి పంటలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బాబూనాయక్ మాట్లాడుతూ.. సాధారణ యూరియా వాడకం కంటే నానో యూరియాను వాడటం వల్ల మొక్కలకు నత్రజని పోషకం ఎక్కువ శాతం అందుతుందన్నారు. నేల నీరు కలుషితం కాకుండా నానో యూరియా దోహదపడుతుందన్నారు. సాధారణ యూరియాను పంటలకు చల్లుకోవడం ద్వారా పోషకాలు వేరు భాగాల్లో నుంచి కొంత మేర ఆలస్యంగా మొక్కలకు అందుతాయన్నారు. కానీ నానో యూరియాను స్ప్రే చేసుకోవడం ద్వారా ఆకులపై పడటంతో పోషకాలు త్వరగా అందే అవకాశాలుంటాయని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు. అంతకు ముందు నానో యూరియా లాభాలపై రైతు వేదికలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఓ గోవిందరాజు,ఎంపీఓ నాగభూషణం,ఏఈఓ రమ్యశ్రీ, రైతులు పాల్గొన్నారు.


