మౌలికం.. మళ్లీ మొదటికి | - | Sakshi
Sakshi News home page

మౌలికం.. మళ్లీ మొదటికి

Sep 12 2026 11:09 AM | Updated on Sep 12 2026 11:09 AM

యూఎఫ్‌ఐడీఎఫ్‌ పనుల్లో ప్రతిష్టంభన

యూఎఫ్‌ఐడీఎఫ్‌ పనుల్లో ప్రతిష్టంభన

మున్సిపాలిటీల్లో యూఎఫ్‌ఐడీఎఫ్‌(అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌) పనుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. టెండర్‌ ప్రక్రియలో జాప్యం, ఇతర కారణాలతో ఏడాదిగా ఈ పనులు ముందుకుసాగలేదు. తాజాగా టెండర్‌ పూర్తయినా... నిధులు ఎక్కడినుంచి వస్తాయోనని తెలిపే ‘హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌’పై స్పష్టత లేదనే కారణంతో పనులు ప్రారంభించలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. పనులు జరిగిన చోట బిల్లులు రావడం లేదని...తాము కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటామేమోనని జంకుతున్నారు.

–గజ్వేల్‌

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా యూఐడీఎఫ్‌ ద్వారా రాష్ట్రంలోని ప్రతీ మున్సిపాలిటీకి రూ.15కోట్ల చొప్పున నిధులను విడుదల చేశారు. జిల్లాలోని గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌, సిద్దిపేట, హుస్నాబాద్‌, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలకు నిధులు మంజూరయ్యాయి. ఇందులోభాగంగానే సిద్దిపేట మున్సిపాలిటీలో పనులు కొనసాగుతున్నాయి. కానీ ఈ పనులకు నిధులు ఎక్కడి నుంచి వస్తాయనే విషయాన్ని తెలిపే ‘హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌’పై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఫలితంగా బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని తూప్రాన్‌ మున్సిపాలిటీలోనూ ఈ పనులు జరిగాయి. కానీ బిల్లుల చెల్లింపుపై స్పష్టత లేదు. ఈ పరిస్థితి వల్ల జిల్లాలోని మిగతా మున్సిపాలిటీల్లో టెండర్లు దక్కించుకుని అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తి చేసుకున్న కాంట్రాక్టర్లు తాము కూడా ఇదే రకమైన పరిస్థితిని ఎదుర్కుంటామనే భయంతో పనులు ప్రారంభించడానికి ముందుకు రావడం లేదు. ఒక రకంగా చెప్పాలంటే చేతులెత్తేశారు కూడా.

మౌలిక వసతులు కరువై అవస్థలు

జిల్లాలోని మున్సిపాలిటీల్లో పెరుగుతున్న జనాభా అవసరాలకనుగుణంగా మౌలిక వసతులు లేకపోవడం వల్ల అవస్థల మధ్య కాలం గడపాల్సి వస్తోంది. ఇదే క్రమంలో ఏడాది కిందట మంజూరైన యూఐడీఎఫ్‌ పనులు చేపడితే కొంతమేరకై నా సమస్యలు తీరుతాయని భావిస్తే పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీలో యూఐడీఎఫ్‌ కింద ఇందిరాపార్కు చౌరస్తా సుందరీకరణకు రూ.కోటి, హౌజింగ్‌ బోర్డు మైదానంలోని చిల్డ్రన్స్‌ పార్కు ఆధునీకరణకు రూ.కోటి, సంగాపూర్‌ రోడ్డు వైపున కొత్త షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణానికి రూ.40లక్షలు, తూప్రాన్‌ రోడ్డువైపున వరద కాల్వల నిర్మాణానికి రూ.1.2కోట్లు, మిగతా నిధులను వివిధ వార్డుల్లో ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వరద కాల్వల నిర్మాణానికి ప్రతిపాదించారు. కానీ ఈ పనుల్లో కదలిక లేదు. దుబ్బాక, హుస్నాబాద్‌, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇదేరకంగా ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రతిపాదించారు. కానీ పనులు ముందుకు సాగక...నిరాశే నెలకొంది.

ఉన్నతాధికారుల

దృష్టికి తీసుకెళ్తాం

పట్టణాల్లో మెరుగైన వసతులే లక్ష్యంగా యూఐడీఎఫ్‌ కింద నిధులు వచ్చాయి. పనులు ప్రారంభించే అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. త్వరలోనే ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తాం.

– గణేశ్‌రెడ్డి,

గజ్వేల్‌–ప్రజ్ఞాపూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌

‘హెడ్‌ ఆఫ్‌ అకౌంట్‌’పై స్పష్టత కరువు

బిల్లులు వస్తాయో రావోనని అనుమానం

పనులు చేయలేమంటూ చేతులెత్తేసిన కాంట్రాక్టర్లు

జిల్లాలోని మున్సిపాలిటీల్లో దుస్థితి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement