● కలెక్టరేట్ ఎదుట రైస్‌మిల్లర్ల నిరసన
● జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొమురవెల్లి చంద్రశేఖర్
సిద్దిపేటరూరల్: ప్రభుత్వం గత మూడు పంటలకు సంబంధించిన ధాన్యాన్ని రైస్‌మిల్లులో నిల్వ ఉంచడం వల్ల తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని వెంటనే ప్రభుత్వం నిల్వ ఉంచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, కొమురవెల్లి చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిల్వ ఉంచిన ధాన్యాన్ని తీసుకోవాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, రూరల్ అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ... ప్రభుత్వం గత 3 పంటలకు సంబంధించి సుమారు రూ. 1500 కోట్ల విలువైన ధాన్యం నిల్వలున్నాయన్నారు. ఎక్కువ రోజులుగా నిల్వ ఉండటం వల్ల నాణ్యత దెబ్బతిని పాడవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు తనిఖీ చేస్తే నిల్వలు తక్కువగా ఉన్నట్లు చూపే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. గత మూడేళ్ల క్రితం ఎఫ్‌సీఐ అధికారులు స్థలం కేటాయించినప్పటికీ అదే సీజన్‌లో డెలివరీ చేయలేకపోతున్నట్లు తెలిపారు. పాత ధాన్యాన్ని తీసుకున్న తర్వాతే కొత్త ధాన్యం కేటాయించాలని డిమాండ్ చేశారు.


