కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ నేతల నిరసనలతో..
డప్పుకొడుతూ ఫాంహౌస్ ముట్టడికి వెళ్తున్న డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి
మర్కూక్ వరదరాజుపూర్‌లో కాంగ్రెస్, బీసీఆర్‌ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం.. అదుపుచేస్తున్న పోలీసులు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పోటాపోటీ ఆందోళన కార్యక్రమాలతో మంగళవారం గజ్వేల్ నియోజకవర్గం దద్దరిల్లింది. మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను డప్పుచప్పుళ్లతో ముట్టడించడానికి కాంగ్రెస్, పోటీగా బీఆర్‌ఎస్ ఆందోళన కార్యక్రమాలను చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో వందలాది పోలీసులు మోహరించారు. కట్టడికి తీవ్రంగా శ్రమించారు. –గజ్వేల్
స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై మాదిగ, మాల సంఘాల జేఏసీతో కలిసి కాంగ్రెస్ వెయ్యి డప్పులతో ఫామ్‌హౌస్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డితోపాటు మాదిగ, మాల సంఘాల నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్ సమీపంలోని వర్ధరాజపూర్‌కు చేరుకున్నారు. డప్పుచప్పుళ్లతో శివారువెంకటాపూర్ రోడ్డువైపు నుంచి ఫామ్‌హౌస్ వైపునకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ భారీ సంఖ్యలో మోహరించి ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, బీఆర్‌ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. తోపులాటలో నర్సారెడ్డికి గాయాలవడంతో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం పోలీసుల చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు వాహనానికి అడ్డుపడ్డారు. పోలీసులు వారికి పక్కకు తోసి అక్కడి నుంచి నర్సారెడ్డిని.. ముందుగా ప్రజ్ఞాపూర్ అతిథి ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం..హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
నాలుగు రోడ్లలోనూ టెన్షన్..
కాంగ్రెస్ ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లే ఎర్రవల్లి, శివారువెంకటాపూర్, వర్దరాజపూర్, మర్కూక్, దామరకుంట దారుల్లో టెన్షన్ వాతావారణం నెలకొంది. ఈ దారులను అష్టదిగ్బంధనం చేయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇతర పోలీసు ఉన్నతాధికారులు రష్మీపెరుమాళ్, జోయల్‌డేవిస్, అనురాధతోపాటు గతంలో ఇక్కడ పనిచేసిన వెళ్లిన ఏసీపీ స్థాయి, సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులను రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడికి రప్పించి ఆందోళన కార్యక్రమాలను కట్టడి చేయడానికి ప్రయత్నించారు. దామరకుంటలో కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ మాజీ ఎంపీటీసీ కృష్ణ ఇంటిపైకి దూసుకెళ్లడం ఉద్రిక్తతను సృష్టించింది. ఈ సందర్భంగా ఆయన ఇంటిపైకి రాళ్ల రువ్వడమేకాకుండా దాడి చేయడంతోపాటు కృష్ణతోపాటు మరో ఇద్దరికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహానికి గురైన బీఆర్‌ఎస్ కార్యకర్తలు సైతం రాళ్లు రువ్వడంతో పలువురు కాంగ్రెస్ నాయకుల కారు అద్ధాలు ధ్వంసమయ్యాయి. వర్ధరాజపూర్ వద్ద కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వర్గాల తోపులాట చోటుచేసుకున్నది. బీఆర్‌ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పరస్పర వ్యతిరేక నినాదాలు దద్దరిల్లాయి. ఈ సందర్భంగా ఒకరిపై, మరొకరు చెప్పులు, వాటర్‌బాటిళ్లను విసురుకున్నారు. ఈ సందర్భంగా చాలాసేపు ఉద్రిక్తత కొనసాగింది.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి: నర్సారెడ్డి
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతలు అరాచకం ప్రదర్శించడం వల్లే సమస్యలు వస్తున్నాయని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి మండిపడ్డారు. ఫామ్‌హౌస్ ముట్టడి సందర్భంగా గాయపడిన ఆయన విలేకరులతో మాట్లాడారు. అత్యున్నతమైన పదవిలో ఉన్న స్పీకర్‌ను ఇష్టానుసారంగా దూషించడమేకాకుండా, పోలీసులపైనే బీఆర్‌ఎస్ నేతలు దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సంఘటనపై కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్
పోటాపోటీ ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్తం
దద్దరిల్లిన గజ్వేల్ నియోజకవర్గం
వందలాదిగా పోలీసుల మోహరింపు
గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఇన్‌ఛార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి
కాంగ్రెస్ తీరుకు నిరసనగా బీఆర్‌ఎస్ ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి సింగాయిపల్లి వద్ద రాజీవ్‌రహదారిపై రాస్తారోకో నిర్వహించడం ఉద్రిక్తతను సృష్టించింది. హుటాహుటినా పోలీసులు అక్కడికి చేరుకొని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పంపించారు. కాగా మర్కూక్‌లో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కర్ణాకర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మాజీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీ రవీందర్ తదితరులు నిర్వహించిన రైతు ధర్నా కూడా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.


