తొగుట(దుబ్బాక): ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు సూచించారు. మిరుదొడ్డి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పర్పంచ్‌లు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని హామీనిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని హెచ్చరించారు. సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచ్‌లు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
డీఏఈ స్వరూపరాణి
చేర్యాల(సిద్దిపేట): ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండాలని డీఏఓ స్వరూపరాణి రైతులకు సూచించారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అలాగే ప్రతి మంగళవారం జరిగే వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమంలో రైతులు పాల్గొని నూతన విషయాలు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం పలు పంటలను ఆమె స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఏఓ అఫ్రోజ్, ఆత్మ చైర్మన్ తిరుపతి, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ –2027 కోసం యువత నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు జిల్లా యువజన అధికారి రంజిత్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జిల్లాలోని 15 ఏళ్ల నుంచి 29 ఏళ్లు ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. వికసిత్ భారత్ ఛాలెంజ్, డిజైన్ ఫర్ భారత్, హ్యాక్ ఫర్ సోషల్ కాజ్,యూత్ ఆంత్ర, యూత్ పార్లమెంట్ అనే అంశాల్లో పోటీలు ఉంటాయని తెలిపారు. ఎంపిక ప్రక్రియ డిజిటల్ క్విజ్, వ్యాస రచన, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజెంటేషన్, గ్రాండ్ ఫినాలే వరకు అనేక దశల్లో కొనసాగుతుందన్నారు.
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): హైదరాబాద్‌లో జరిగిన అలయన్స్ క్లబ్ సౌత్ మల్టీపుల్ సమావేశంలో సిద్దిపేట అలయెన్స్ క్లబ్‌కు 4 అవార్డులు వచ్చాయని అలయెన్స్ క్లబ్ సభ్యులు ఆత్మరాములు తెలిపారు. సిద్దిపేటలో అలయెన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లాలో చేస్తున్న సేవ కార్యక్రమాలకు ఈ అవార్డులు వచ్చాయని తెలిపారు. ఈ అవార్డులతో తమ బాధ్యత మరింతగా పెరిగిందని వారు అన్నారు.
చేర్యాల(సిద్దిపేట): కనీస వేతన సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణలో ప్రధాన కార్మిక సంఘాలైన సీఐటీయూ, ఏటీయూసీ, ఐఎన్‌టీయూసీ ప్రాతినిధ్యం నిరాకరించడం దుర్మార్గమని సీఐటీయూ జిల్లా సహాయకార్యదర్శి శోభ అన్నారు. వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ కన్వీనర్ భాస్కర్, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.


