ఉత్తమ ప్లానింగ్‌తో
జీపీడీపీలో సిద్దిపేట అర్బన్ టాప్
● 95 శాతం మార్కులు సాధించిన 12 గ్రామాలు
సిద్దిపేటఅర్బన్: ప్రతి సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ రూపొందించుకొని పార్లమెంట్‌లో, అసెంబ్లీలో ప్రవేశపెట్టడం మనం చూస్తూనే ఉంటాం. కానీ ప్రత్యేకంగా గ్రామ పంచాయతీలకు బడ్జెట్ రూపొందించడం అనే ప్రక్రియ ఇంత వరకు లేదు. కానీ బడ్జెట్ మాదిరిగానే గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్ ప్లాన్ (జీపీడీపీ) ను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇటీవల రూపొందించిన 2026–27 జీపీడీపీలో సిద్దిపేట అర్బన్ మండలంలోని ఆయా గ్రామ పంచాయతీలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచాయి. జీపీడీపీలో భాగంగా గ్రామ ప్రజల అవసరాలు, మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, తాగునీరు, పచ్చదనం, ఆరోగ్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం, సామాజిక భద్రత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి ప్రణాళికను రూపొందించారు.
నిర్దిష్ట ప్రణాళికతో పని చేసిన అధికారులు
రాబోయే రోజుల్లో గ్రామాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది, ఏ ఏ పనులు పెండింగ్ లో ఉన్నాయి వాటిలో ప్రాధాన్యత క్రమంలో ఏ పనులను ముందు చేపట్టాలి, వాటి కోసం ఎంత నిధులు అవసరమవుతాయి, గ్రామంలో ప్రధాన మౌలిక వసతుల లేమి ఏంటి అనే విషయాలను గుర్తించి ఆ మేరకు కమిటీ నిర్ధిష్ట ప్రణాళిక రూపొందించింది. ఆ ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించడంలో అధికారులు విజయవంతంగా పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. జీపీడీపీ కమిటీకి ఎంపీడీఓ అధ్యక్షుడిగా, ఎంపీఓ కన్వీనర్‌గా, 14 శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు.
ఒక్కో గ్రామానికి ఒక్కో అంశం
గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రూపొందించిన యాక్షన్ ప్లాన్‌లో అధికారులు ఒక్కో గ్రామానికి ఒక్కో ప్రత్యేకమైన అంశంను కేటాయించి ఆ అంశం వారీగా అభివృద్ధి ప్రణాళిక రూపొందించారు.
95 శాతం సగటు సాధించిన సిద్దిపేట అర్బన్
మండలంలోని 12 గ్రామ పంచాయతీలు జీపీడీపీలో పాల్గొనగా కనిష్టంగా 93 శాతం మార్కుల నుంచి గరిష్టంగా 98 శాతం మార్కులు సాధించాయి. మండల స్థాయిలో మొత్తంగా 1200 మార్కులకు గాను సిద్దిపేట అర్బన్ మండలం 1143 మార్కులు సాధించి 95 శాతం సగటుతో జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. గ్రామాల వారీగా తడ్కపల్లి 98%, మందపల్లి 98%, మిట్టపల్లి 97%, బూరుగుపల్లి 96%, ఎన్సాన్‌పల్లి 96%, పాండవపురం 95%, కిష్ఠసాగర్ 95%, నాంచారుపల్లి 95%, ఎల్లుపల్లి 94%, బక్రిచెప్యాల 93%, పొన్నాల 93%, వెల్కటూరు 93 శాతం సాధించాయి.


