ఒకప్పుడు ప్రైవేటు కళాశాలల వైపు మొగ్గు చూపిన విద్యార్థులు ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన, ఆధునిక బోధనా పరికరాల ఏర్పాటు, విద్యార్థులు–తల్లిదండ్రులతో నిరంతర అనుసంధానం, ప్రభుత్వం కల్పిస్తున్న సౌకార్యలపై ప్రచారం వంటి చర్యలు ప్రవేశాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి. గతేడాదికంటే ఈ సంవత్సరం 287 ప్రవేశాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పెరిగాయి.
–సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు రూ.2.67 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రతీ కళాశాలకు రెండు చొప్పున ఇంటిగ్రేటెడ్ ఫ్లాట్ ప్యానల్ బోర్డులు, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ బోర్డులు అందించారు. డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలను బోధించడం ద్వారా విద్యార్థులకు విషయాలను సులభంగా అర్థమయ్యేలా చేస్తున్నారు. 2025–26 విద్యా ఏడాదిలో మొదటి సంవత్సరంలో 2,986 మంది చేరగా, 2026–27లో 3,273 మంది ప్రవేశాలు పొందారు. ఏడాది వ్యవధిలోనే 287 మంది అదనంగా చేరడం ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోంది. నంగునూరు, ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గతం కంటే కొంత తక్కువగా ప్రవేశాలు జరిగాయి.
రెండుసార్లు పేరెంట్ మీటింగ్‌లు
విద్యార్థుల భవిష్యత్తుపై తల్లిదండ్రుల్లో విశ్వాసం పెంచేందుకు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రెండుసార్లు మెగా పేరెంట్ మీటింగ్‌లు నిర్వహించారు. కళాశాలల్లో అందుబాటులో ఉన్న బోధన, మౌలిక వసతులు, విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలపై తల్లిదండ్రులకు వివరించారు. జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు జూనియర్ కళాశాల అధ్యాపకులను నోడల్ అధికారులుగా నియమించారు. ఆయా పాఠశాలలకు వెళ్లి పదో తరగతి విద్యార్థులతో, వారి తల్లిదండ్రులతో నిరంతరం సంబంధాలు ఏర్పరచుకున్నారు.
విజయగాథలే ‘వాల్ ఆఫ్ ఫేమ్’
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివి ఉన్నత స్థాయికి చేరుకున్న పూర్వ విద్యార్థుల వివరాలతో ప్రత్యేకంగా ‘వాల్ ఆఫ్ ఫేమ్’ఏర్పాటు చేశారు. గతంలో జిల్లాలోని ఆయా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ప్రస్తుతం ఏ రంగంలో, ఏ స్థాయిలో ఉన్నారో ఫ్లెక్సీల రూపంలో ప్రదర్శించారు. కళాశాలలను సందర్శించిన తల్లిదండ్రులు, విద్యార్థులు వీటిని ఆసక్తిగా పరిశీలించారు. ఇది కూడా ప్రవేశాల పెరుగుదలకు ఒక ప్రధాన కారణంగా మారింది.
ఉన్నత విద్యకు భరోసా
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు ఇంజినీరింగ్, నీట్ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో సీట్లు సాధిస్తే వారికి వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్ సదుపాయం అందుబాటులో ఉంది. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు ఇది పెద్ద భరోసాగా మారుతోంది. తక్కువ ఖర్చుతో ఇంటర్మీడియెట్ విద్యను పూర్తి చేసి, ఉన్నత విద్యలోనూ అవకాశాలు పొందవచ్చనే అంశం తల్లిదండ్రులను ప్రభుత్వ కళాశాలల వైపు ఆకర్షిస్తోంది.
జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు పెరుగుతున్న ఆదరణ
ఈ ఏడాది ఇంటర్‌లో 287కు పెరిగిన ప్రవేశాలు
పూర్వ విద్యార్థుల విజయగాథలే ‘వాల్ ఆఫ్ ఫేమ్’


