● అయోమయంలో రైతులు
● ఒకవైపు వర్షాభావంమరోవైపు కరెంట్ కోతలు
● యూరియా కొరతతో ఇబ్బందులు
ఒకవైపు వానలు లేక మరోవైపు కరెంట్ కోతలతో రైతులు సతమతమవుతున్నారు. ఇటీవల వర్షాలకు రైతులు ఎక్కువ విస్తీర్ణంలో వరి పంట సాగు చేయగా..గత ఇరవై రోజుల నుంచి వర్షాలు లేక పోవడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకుని పంటభూములు నెర్రెలు వారుతున్నాయి. కళ్ల ముందే పంటలు ఎండి పోతుండటంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
–దుబ్బాకరూరల్
ఎల్నినో ప్రభావంతో వర్షాకాల ప్రారంభంలో వర్షాలు సరిగ్గా కురవక పోవడంతో రైతులు పంట పొలాలను చదును చేసి నాట్లు కొంత ఆలస్యంగా వేశారు. మధ్యలో కొన్ని తుఫానుల కారణంగా పంట పొలాల్లో నీళ్లు నిలవడంతో ఎక్కువ విస్తీర్ణంలో రైతులు వరి నాట్లు వేశారు. వరి నాట్లు వేసి రెండు నెలలు అవుతున్నా వరి పంటలు ఏపుగా పెరిగే దశలోనే వర్షాలు కురవక పోవడంతో నీళ్లు అందక పంటలు నెర్రెలు వారి ఎండిపోయె దశకు చేరాయి.
కరెంట్ కోతలు అదనం
ప్రభుత్వం పంటల సాగుకు 12గంటలు కరెంట్ ఇస్తామంటూనే కోతలు విధిస్తోంది. ఒక్కో రోజు ఒక్కోవిధంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విద్యుత్ సరఫరా చేయాలి. రోజుకు పది, పదకొండు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా చేస్తున్నారు. బ్రేక్ డౌన్లు, ఎల్‌సీల పేరుతో కరెంట్ కోతలు విధిస్తున్నారు. వచ్చే పన్నెండు గంటల్లో రోజుకు రెండు, మూడు గంటల కరెంట్ కోత విధిస్తున్నారు. దీంతో పంటలు సాగు రైతులకు కష్టంగా మారింది.
పైపులతో పంటకు నీళ్లు
వరి పంటలకు నీళ్లు అందకపోవడంతో రైతులు బోర్ల నుంచి పైపులు వేసి నీళ్లు అందిస్తున్నారు. రోజుకో మడికి పైపుల ద్వారా పంటలకు నీళ్లు పెడుతున్నారు. దీనికితోడు యాప్‌లో యూరియా బుక్‌కాక పోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు.


