● ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి
● గజ్వేల్‌లో విద్యార్థులతో కలిసి బీఆర్‌ఎస్ ధర్నా
గజ్వేల్: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతోపాటు యువతకు ఇచ్చిన హామీలను విస్మరించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని ఎఫ్‌డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం గజ్వేల్‌లో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ..ఫీజు రీయింబర్స్‌మెంట్ రూ.12వేల కోట్లను ప్రభుత్వం బకాయిపెట్టడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2లక్షల ఉద్యోగాలిస్తానని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి మాట తప్పారని మండిపడ్డారు. ‘యూత్ డిక్లరేషన్’అమలు చేయడంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. విద్యార్థులు, యువత పక్షాన పోరాటం ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాక్రిష్ణశర్మ, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ చందన, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
‘ప్రజావాణి’లో ఆర్‌డీఓకు ఫిర్యాదు
గజ్వేల్‌లోని ఆర్‌డీఓ కార్యాలయంలో నిర్వహించిన ‘ప్రజావాణి’లో వంటేరు ప్రతాప్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నేతలతో కలిసి స్థానిక ఆర్‌డీఓ వీవీఎల్ చంద్రకళకు ఫిర్యాదు చేశారు.


