సిద్దిపేటజోన్: పేద మహిళలకు ఆర్థిక భరోసాగా నిలిచే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వ పతనం ఖాయమని బీఆర్‌ఎస్ నేతలు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్, మాజీ జెడ్పీ చైర్మన్ రోజాశర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్స్‌లు మాట్లాడారు.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. కల్యాణలక్ష్మి అనేది పథకం కాదని, పేదల కుటుంబాల్లో వెలుగులు నింపే మంచి కార్యక్రమమన్నారు. ఎన్నికల్లో తులం బంగారం హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉన్న పథకాన్ని రద్దు చేసే కుట్ర చేయడం తగదన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ సదానందానికి అందించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సిద్దిపేటజోన్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ పార్టీ బురద జల్లే ప్రయత్నాలు చేస్తోందని రాష్ట్ర పద్మశాలీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ హయాంలో సిద్దిపేట మున్సిపల్‌లో రూ.వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్ ధర్నాను ప్రజలు నమ్మడం లేదన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆర్టీఏ సభ్యులు సూర్యవర్మ, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు యాదగిరి, మహేందర్, మాజీ కౌన్సిలర్లు ఆనంద్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
అధ్యాపకుల నిరసన
నంగునూరు(సిద్దిపేట): పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో కలపడాన్ని నిరసిస్తూ సోమవారం రాజగోపాల్‌పేట కళాశాల అధ్యాపకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ యూనివర్సిటీల్లో విలీనం చేస్తే విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తీరని నష్టం జరుగుందన్నారు.
మిరుదొడ్డి(దుబ్బాక): తాగు నీటి కోసం అల్వాల పంచాయతీ పరిధిలోని రాంనగర్ కాలనీ వాసులు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. బిందెలు, బకెట్లు, డ్రమ్ములు, ముళ్లకంచెలను రోడ్డుకు అడ్డంగా వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేదని వాపోయారు. గుక్కెడు నీటి కోసం వ్యవసాయ బావులను ఆశ్రయించాల్సి వస్తోందంటూ అసహనం వ్యక్తం చేశారు. పోలీసులు ఆందోళన వద్దకు చేరుకుని అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. తాగు నీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటా మని అధికారులు హామీ ఇవ్వడంతో కాలనీ వాసులు ఆందోళన విరమించారు.
ఉచిత శిక్షణనుసద్వినియోగం చేసుకోండి
సిద్దిపేటజోన్: ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులను యువత సద్వినియోగం చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి యోగేశ్వర్ జాదవ్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలో కేవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత డ్రైవింగ్ శిక్షణ సెంటర్‌ను ఫౌండేషన్ చైర్మన్ వంశీధర్ రావుతో కలిసి ప్రారంభించారు. యోగేశ్వర్ మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దని సూచించారు


