గ్రామంలో మద్యం విక్రయిస్తే రూ.2లక్షల జరిమానా విధించాలని తీర్మానం
దుబ్బాకరూరల్: మండలంలోని పోతారం గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహించకూడదని, మద్యపానం నిషేధించాలని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. సర్పంచ్ రేణుక మల్లేశం మాట్లాడుతూ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల కొంత మంది మద్యానికి బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. వచ్చిన కూలీ డబ్బును మద్యానికి ఖర్చు చేయడంతో కుటుంబాలను పోషించలేక పోతున్నారని తెలిపారు. ఎవరైనా బెల్ట్ షాపులు నిర్వహించి మద్యం అమ్మితే రూ.2లక్షల జరిమానాతో పాటు, నల్లా కనెక్షన్ బంద్, గ్రామ పంచాయతీ సేవలు నిలిపివేస్తామన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


