మంత్రి పొన్నం ప్రభాకర్ రూ. 5.49 కోట్లతో ఆధునిక పరికరాలు.. కొనుగోలుకు జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఆమోదం రెండేళ్లుగా ఆరోగ్య నిధులు పెండింగ్: ఎమ్మెల్యే హరీశ్‌రావు
సిద్దిపేటరూరల్: పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం కలెక్టర్ హైమావతి అధ్యక్షతన సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి పొన్నం, ఎమ్మెల్యే హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు ఆశించినంతగా జిల్లా ప్రజలకు అందడం లేదని అన్నారు. వైద్య సేవలు సమర్థవంతంగా అందేలా అధికారులు, వైద్యులు సమష్టిగా కృషి చేయాలన్నారు. ఆస్పత్రి, నర్సింగ్ కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను పరిశీలించి, వాటి భర్తీకి అవసరమైన ప్రతిపాదనలను తక్షణమే ప్రభుత్వానికి పంపాలని అధికారులను ఆదేశించారు. ఆస్పత్రి అభివృద్ధికి అవసరమైన అదనపు నిధుల కోసం ప్రభుత్వం, జిల్లా ఇన్‌చార్జి మంత్రికి సమగ్ర నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలోని 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య పరీక్షలను మరింత విస్త్రృతంగా నిర్వహించాలన్నారు. అనవసరంగా సీ–సెక్షన్ ప్రసవాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగుల ఇబ్బందులను పరిష్కరించాలన్నారు. రెండేళ్లుగా ఆరోగ్యశ్రీ నిధులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి అంటే నమ్మకం కలిగేలా పనిచేయాలని, ఖాళీగా ఉన్న వైద్య పోస్టులు భర్తీ చేయాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో రూ.18 కోట్లతో ఎంఆర్‌ఐ స్కాన్ మంజూరు చేశామని, వెంటనే సేవలను ప్రజలకు అందించాలన్నారు. ఆస్పత్రిలో సరైన శానిటేషన్ లేదని, హానికర చెత్త కుప్పలు, దోమలు, ఈగలతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సరైన సమయానికి రోగులకు భోజనం, టిఫిన్ అందించడం లేదన్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య చికిత్సలో భాగంగా రోగులకు ఇవ్వాల్సిన మందులు ప్రైవేట్ ఫార్మసిలో లభిస్తున్నాయన్నారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే అత్యవసర చికిత్స కోసం పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్థో సేవలు మెరుగు పరిచి నెలకు 100 సర్జరీలు చేయాలన్నారు. గతంలో మోకాలు చిప్ప ఆపరేషన్‌లు జరిగేవని, నేడు ఎందుకు చేయడం లేదని హరీశ్‌రావు అన్నారు. గతంలో రక్తనమూనాలు సేకరించిన అనంతరం రిపోర్టులు 18 గంటల్లో వచ్చివని, నేడు 36 గంటలు దాటినా రావడం లేదన్నారు. ఆస్పత్రిలో ఎంతమంది వైద్యులు ఉన్నారని సూపరింటెండెంట్‌ను అడగగా సమాధానం చెప్పకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య అధికారులు తీరు మార్చుకోవాలన్నారు. కాగా సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో రూ.5 కోట్ల 49 లక్షలతో వైద్య పరికరాల కొనుగోలుకు అభివృద్ధి కమిటీ ఆమోదం తెలిపింది. అనంరతం ప్రొ.జయశంకర్ జయంత్రి సందర్భంగా చిత్రపటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సంగీత షా, వైద్యాధికారి ధనరాజ్, అధికారులు పాల్గొన్నారు.
వైద్యులు సమష్టిగా కృషి చేయాలి


