వర్గల్(గజ్వేల్): వర్గల్ విద్యాధరి అమ్మవారిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని రాష్ట్ర ట్రెజరీ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ నాగరాజు అన్నారు. గురువారం సతీసమేతంగా వర్గల్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా అర్చకులు వేద ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు వారిని శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. ‘అమ్మ‘ను దర్శించుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ఆయన వెంట గజ్వేల్ ఎస్‌టీఓ లింగం ఉన్నారు.
న్యాయవాదుల
విధుల బహిష్కరణ
చేర్యాల(సిద్దిపేట):కొల్లాపూర్ కోర్టు పరిధిలోని పెంట్లవెల్లిలో న్యాయవాది మల్లయ్య హత్యకు నిరసనగా గురువారం చేర్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరమల్లయ్య మాట్లాడుతూ ప్రజలకు న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న న్యాయవాదిపై దాడిచేసి హత్యచేయడం అత్యంత బాధాకరమన్నారు. ఇది న్యాయవాదుల భద్రతపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్‌సెక్రటరీ రమేశ్, ఉపాధ్యక్షుడు సురేందర్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ కోతలపై
అన్నదాతల నిరసన
అక్కన్నపేట(హుస్నాబాద్): అప్రకటిత విద్యుత్ కోతలను నిరసిస్తూ అక్కన్నపేట మండలం ధర్మారం గ్రామంలోని పలువురు రైతులు గురువారం స్థానిక సబ్‌స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. వ్యవసాయ రంగానికి వచ్చే త్రీఫేజ్ కరెంట్ సరఫరాలో అంతరాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి నిరంతర త్రీఫేజ్ విద్యుత సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, కనీసం ఐదారు గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. సమయంపాలన లేకుండా అధికారులు కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. రాత్రి, పగలు తేడా లేకుండా వ్యవసాయ బావుల వద్ద కరెంట్ కోసం పడిగాపులు కాస్తున్నామన్నారు. ఒక పక్క ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదని, మరోపక్క కరెంట్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇకనైనా 24గంటల పాటు కరెంట్ సరఫరా ఇవ్వాలని, లేనిపక్షంలో రైతులతో ఆందోళన బాటపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు.
విస్తృత తనిఖీలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా రవాణాశాఖ ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. గురువారం సిద్దిపేట పట్టణంలో పరిమితికి మించి విద్యార్థులను తీసుకెళ్తుతున్న ఆటోల నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది ఉన్నారు.


