● మంత్రి పొన్నం ప్రభాకర్ ● కోహెడ మండలంలో విస్తృత పర్యటన ● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
కోహెడరూరల్(హుస్నాబాద్): హుస్నాబాద్ నియోజకవర్గ ప్రాంతంలోని గౌరవెల్లి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. కోహెడ వ్యవసాయ మార్కెట్‌లో రూ.1.61 కోట్ల వ్యయంతో నిర్మించే పనులకు, ధర్మాసాగర్‌పల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించి, వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ భూసేకరణ కోసం రూ.250 కోట్లు విడుదల చేశామన్నారు. రైతులు భూసేకరణకు సహకారించాలని కోరారు. ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలిగిపోయాయని, కుడి, ఎడమ కాలువ పనులను ప్రభుత్వం నిరంతరం సమీక్షిస్తోందన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నాని అన్నారు. ఈప్రాజెక్టు పూర్తయితే ఈప్రాంత రైతాంగానికి సాగు నీటి పరంగా ఎంతో మేలు జరుగుతోందని తెలిపారు. ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.అంతకుముందు తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, ప్రజాయుద్దనౌక గద్దర్ వర్ధంతి వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, జిల్లా మార్కెట్ కమిటీ అధికారి దుర్గం ప్రకాశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల, పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, వైస్ చైర్మన్ భీంరెడ్డి తిరుపతిరెడ్డి, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.


