18 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

18 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలి

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట రైతుల ఆందోళన

మిరుదొడ్డి(దుబ్బాక): వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం అక్బర్‌పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్‌ రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించి ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నా రు. కనీసం రోజుకు 8 గంటల నిరంతరంగా కరెంటు అందించలేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేకపోవడంతో నారు మడులను కూడా వేసుకోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ధర్నా విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్‌ ఎస్‌ఈ, ఏడీఏ, ఏఈలతో ఫోన్‌లో పోలీసులు మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడంతో రైతులు ఆందోళనను విరమించారు.

నీళ్లివ్వాలని చేయి కోసుకున్న రైతు

దుబ్బాకరూరల్‌: వర్షాలు కురువక పోవడంతో రైతులు వరి తుకాలు పోసి వదిలేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని ఆవేదన చెందిన దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన రుద్రారం ప్రశాంత్‌ అనే యువకుడు తన పొలంలో నిలబడి ‘‘సీఎం రేవంత్‌రెడ్డి మా పొలాలు ఎండి పోతున్నాయి. మల్లన్నసాగర్‌ కాలువల ద్వారా మా పొలాలకు నీళ్లివ్వండి’’అంటూ బ్లేడ్‌తో చేయి కోసుకుని తన పొలంలో భూమికి రక్తం బొట్టు పెట్టాడు. ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

ధర్మారెడ్డి సబ్‌స్టేషన్‌ వద్ద ...

గజ్వేల్‌రూరల్‌: ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ 4 గంటలు సైతం సరిగ్గా రావడం లేదని గజ్వేల్‌ మండలం ధర్మారెడ్డిపల్లిలో గురువారం అన్నదాతలు సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామసర్పంచ్‌ కాసమొల్ల శ్రీనివాస్‌, ఫ్యాక్స్‌ చైర్మన్‌ జేజేల వెంకటేశంగౌడ్‌లు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలతో అన్నదాతలను మభ్యపెడుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పంటల సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు సత్తయ్య, నవీన్‌, నరేందర్‌, శ్యామ్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement