రైతుల ఏకరువు | - | Sakshi
Sakshi News home page

రైతుల ఏకరువు

Jul 17 2026 7:15 AM | Updated on Jul 17 2026 7:15 AM

రిజర్వాయర్లను నింపుతారో..? లేదో..? కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూపులు సాగు... సాగక రైతుల ఆందోళన మల్లన్న, కొండపోచమ్మ,రంగనాయక సాగర్‌లలో పడిపోయిన నీటిమట్టం జిల్లాలో కనిపిస్తోన్న కరువు ప్రమాద ఘంటికలు

ఎల్‌నినో తీవ్రరూపం దాల్చిన వేళ...‘సాగు’ముందుకు సాగక ఆందోళనలో ఉన్న రైతులు కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ, రంగనాయకసాగర్‌ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోగా ప్రస్తుతం నింపుతారా...? లేదా...? అనే

ఆందోళన సర్వత్రా మొదలైంది. జిల్లా వ్యవసాయానికి ప్రాణధారమైన ఈ రిజర్వాయర్లను నింపకపోతే పరిస్థితేమిటనే కలవరం వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్‌ ఇది.

గజ్వేల్‌: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్‌, 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్‌, మరో 15 టీఎంసీ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లు జిల్లా సాగు, తాగునీటి అవవసరాలకు ప్రధాన ఆధారంగా మారాయి. మేడిగడ్డ నుంచి లిఫ్ట్‌ చేసే గోదావరి జలాలు సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌ మీదుగా జిల్లాలోని రంగనాయకసాగర్‌కు వస్తుంటాయి. ఈ రిజర్వాయర్‌కు జిల్లాలో 1.10 లక్షల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి 2.2కిలోమీటర్ల ఓపెన్‌ కెనాల్‌, మరో 16.2 కిలోమీటర్ల టన్నెల్‌ ద్వారా మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు వస్తాయి. మల్లన్నసాగర్‌ వల్ల సిద్దిపేట, మెదక్‌ జిల్లాలే కాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 15.71 లక్షల ఆయకట్టుకు మేలు చేకూరనుంది. మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మసాగర్‌ను చేరుతాయి. మల్లన్నసాగర్‌ పంపుహౌజ్‌ నుంచి 23 కిమీల పొడవున కొండపోచమ్మ సాగర్‌ వరకు కాలువల ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ వల్ల సిద్దిపేటతోపాటు మేడ్చల్‌, సంగారెడ్డి, మెదక్‌, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో జిల్లాలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతోపాటు పరోక్షంగా మరెన్నో లక్షల ఎకరాల భూముల్లో భూగర్భ జలమట్టం పెరిగి భారీ ప్రయోజనం కలుగుతుంది. కానీ, మేడిగడ్డ ఘటన తర్వాత నీటి ఎత్తిపోతలకు తరచూ అంతరాయం కలుగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లను నింపే విషయంలో స్పష్టతలేకపోవడం వల్ల రంగనాయకసాగర్‌ రిజర్వాయర్‌లో నీటిమట్టం 1 టీఎంసీకి పడిపోగా, మల్లన్నసాగర్‌లో కేవలం 16టీఎంసీల లోపు, కొండపోచమ్మసాగర్‌లో 6.3 టీఎంసీలలోపు మాత్రమే నీరు ఉన్నది. ప్రస్తుతం ఎల్‌నినో తీవ్రరూపం దాల్చి వేళ...తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో సమృద్ధిగా ఉండి ఉంటే కాల్వల ద్వారా నేరుగా పొలాలకు నీరందే అవకాశంతోపాటు లక్షలాది ఎకరాల్లో భూగర్భజలమట్టం పడిపోకుండా ఉండేది. కానీ నేడు జిల్లాలో భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో సాగు, తాగునీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఒకవేళ...ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని కాల్వలకు వదిలితే ఈ సీజన్‌లో రైతులు గట్టెక్కే అవకాశముంది. ఆ దిశగా చర్యలు ఉంటాయా...? అనే విషయంలోనూ స్పష్టత లేదు.

రైతుల్లో కలవరం

జిల్లాలో జూన్‌కు సంబంధించి 105.6 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 53.9 మి.మీలు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 48.9 మి.మీల లోటు వర్షపాతం నమోదైంది. జూలైకు సంబంధించి 184.7 సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు కేవలం 62.8 మి.మీల వర్షపాతం మాత్రమే కురిసింది. ఈ పరిస్థితి వల్ల సాగు ముందుకు సాగటం లేదు. ఈ సీజన్‌కు సంబంధించి 5.41 లక్షల ఎకరాలకుపైగా సాగు అంచనాలో వరి సింహాభాగం 3.85 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే... ఇప్పటివరకు కేవలం 38,500 ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది. పత్తి 1,01,109 ఎకరాల్లో, మొక్కజొన్న 20,804 ఎకరాల్లో, కందులు 4,189 ఎకరాల్లో, పెసర్లు 64 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. జిల్లా రైతులకు ప్రధాన పంట అయిన వరికి జలాశయాలకు నీళ్లు వదిలితేనే ముందుకు సాగే అవకాశమున్నది. లేదంటే గడ్డు కాలం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement