● సెర్ప్,ఎస్‌ఆర్‌డీఎస్ సిబ్బందికి వైద్య పరీక్షలు ● శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ హైమావతి
సిద్దిపేటఅర్బన్/నంగునూరు(సిద్దిపేట): మహిళా సంఘాల్లోని సభ్యులు, ఈజీఎస్ వంటి పనుల్లో విశ్రాంతి లేకుండా ఉండే సిబ్బంది తమ ఆరోగ్య స్థితిగతులను పరీక్షించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండల పరిధిలోని ఎల్లుపల్లి శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో సెర్ప్, ఎస్‌ఆర్‌డీఎస్ సిబ్బందికి నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ హైమావతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్లు అందించే మెడిసిన్‌తో పాటు సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. డాక్టర్లు సూచించిన విధంగా రోజు గంట సేపు వ్యాయామం చేయాలని, మంచి ఆహారం తీసుకోవడం, సరిపడా నీరు తాగడం వంటివి చేయాలని సూచించారు.
వెల్కటూరు పాఠశాల సందర్శన
సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పదవ తరగతి అనేది జీవితానికి ఒక పునాది వంటిదని, విద్యార్థులు బాగా చదువుకుని అందరూ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. అన్ని తరగతులు అవుతున్నాయా? మధ్యాహ్న భోజనం బాగుంటుందా? అని విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంతో పాటు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని రాజగోపాల్‌పేట పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, మందులు, అటెండెన్స్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వైద్యులు సూచించిన విదంగా మందులు వేసుకోవాలని సూచించారు.


