● పెరుగుతున్న ప్రవేశాల సంఖ్య ● భోజనం రుచి లేక తినలేక పోతున్నాం ● కలెక్టర్‌కు విద్యార్థుల గోడు
హాస్టల్లో వసతుల కరువు
హుస్నాబాద్: ‘‘ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు బాగుందనే ఒక్క కారణంతో హాస్టల్ వసతులు ఏలా ఉన్నా సర్దుకుంటున్నాం. రెండో ఏడాదిలో కూడా మార్పు రాకుంటే ఎలా సార్’’అంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధ్యాపకులు, అధికారుల ముందు ఏకరువు పెడుతున్నారు. శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హాస్టల్ వసతి ఉన్నందును రెండో సంవత్సరంలో ఎక్కువమంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన అద్యాపకులచే నాణ్యమైన విధ్యాబోధన, ఆధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ తరగతులు పలు సౌకర్యాలతో విద్యా బోధన చేస్తున్నారు. కళాశాలకు సంబంధించి హాస్టళ్లను హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో అబ్బాయిలు, బస్ డిపో ఎదుట ఉన్న ప్రభుత్వ షెడ్యూల్డు కులాల బాలికలు, కళాశాల వసతి గృహంలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించారు.
వసతి గృహంలో ఉండలేం
ప్రత్యేక హాస్టల్ వసతి ఉందని తెలిసే తల్లిందండ్రులు ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో తమకు అడ్మిషన్లు తీసుకున్నారని ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ అంటే సకల సౌకర్యాలతో సొంత ఇంటిలో ఉండే రుచికరమైన భోజనం ఉంటుందని ఊహించి మమ్ములను ఇక్కడి కళాశాలలో చేర్పించారని తీరా ఇక్కడ చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉందని అమ్మాయిలు వాపోతున్నారు. నాణ్యమైన భోజనం ఉండటం లేదని, నీళ్ల చారుతో భోజనం చేయలేక చాలాసార్లు పస్తులుండి రోజులు గడిపామని వాపోతున్నారు. ఇదే విషయాన్ని బుధవారం హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ హైమావతికి వివరించారు.
అబ్బాయిల పరిస్థితి అలానే
స్థానిక టీచర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో ఇంజనీరింగ్ కళాశాల యువకులకు హాస్టల్ వసతి కల్పించారు. చదివేది ఇంజనీరింగ్ కళాశాలలో, భోజనం చేసేది ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో.. హాస్టల్ వసతి టీచర్స్ ట్రైనింగ్ సెంటర్‌లో. హాస్టల్ నుంచి యువకులు సైకిళ్లపై కిలోమీటర్ దూరంలో ఉన్న బాలుర వసతి గృహనికి వెళ్లి భోజనం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా భోజనం సరిగా లేదంటూ కళాశాల అధ్యాపకులకు చెప్పుకున్న ఫలితం లేకుండా పోతుంది.
వసతులు కల్పిస్తాం
హాస్టల్‌లో భోజనం బాగా లేదని విద్యార్థులు మా దృష్టికి తెచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను శాతవాహన యూ నివర్సిటీ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లాం. దాదాపుగా 200 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా నాణ్యమైన భోజనం, హాస్టల్ వసతి కల్పించేలా ముందస్తుగానే మరో భవనాన్ని పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం.
–తిరుపతిరెడ్డి, ప్రిన్సిపాల్,
ఇంజనీరింగ్ కళాశాల, హుస్నాబాద్


