వనదుర్గమ్మకు వందనం
పాపన్నపేట(మెదక్): వన దుర్గమ్మ సన్నిధి జన సంద్రంగా మారింది. మహాశివరాత్రిని పురస్కరించుకొని మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర ఆదివారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర ఉత్సవంగా గుర్తింపు పొందిన ఏడుపాయల జాతరలో ప్రభుత్వం తరపున మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు, శివానీ దంపతులు దుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. జాతరకు భారీగా భక్తులు తరలివచ్చారు. శివనామస్మరణతో దుర్గమ్మ ఏడుపాయల మారుమోగింది. మంజీర నదిలో ఏర్పాటు చేసిన శివుని విగ్రహం, ఉప్పొంగుతున్న గంగమ్మ భక్తులకు కనువిందు చేశాయి. కాగా, రెండో రోజైన సోమవారం బండ్లు తిరిగే కార్యక్రమం ఉంటుంది.


