మంత్రి మదిలో ఏముందో..?
● నేడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక
● ఆశావహుల తీవ్ర ప్రయత్నాలు
హుస్నాబాద్: స్థానిక రాజకీయాలు మున్సిపల్ చైర్మన్ పీఠం చుట్టూ తిరుగుతున్నాయి. ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో చైర్మన్ గిరి పదవి అదృష్టం ఎవరిదోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు. చైర్మన్ రేసులో 2వ వార్డు కౌన్సిలర్ బూరుగు లత, 10వ వార్డు కౌన్సిలర్ సావుల మంజుల, 14వ వార్డు కౌన్సిలర్ దండి లక్ష్మి, 19వ వార్డు కౌన్సిలర్ బత్తుల స్వరూప ఉన్నారు. ఈ నలుగురి కౌన్సిలర్లలో ఎవరో ఒకరు చైర్మన్ పీఠం ఎక్కనున్నారు. సోమవారం ఉదయం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ 16 స్ధానాలు, 4 స్ధానాలు బీఆర్‌ఎస్ కై వసం చేసుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన మహిళనే చైర్మన్ అవుతారని పలువురు అంటున్నారు. అయితే నలుగురు మహిళల్లో ముగ్గురు మహిళలు మొదటి సారిగా కౌన్సిలర్‌గా గెలుపొందగా.. ఓ మహిళకు గతంలో కౌన్సిలర్‌గా చేసిన అనుభవం ఉంది.
సర్వత్రా ఉత్కంఠ
మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించిన మహిళకే చైర్మన్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఎస్సీలో మాల సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా.. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం ఇస్తారా? అనేది ఉత్కంఠను తెర లేపుతుంది. అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో అంతుపట్టని ప్రశ్నగా ఉంది. గత మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా ఆకుల రజిత, వైస్ చైర్ పర్సన్‌గా అయిలేని అనిత పని చేయగా.. ఈ ఇద్దరి మహిళా ప్రజాప్రతినిధులు తోటి కౌన్సిలర్లతో సమన్వయం చేసుకుంటూ పాలనపరంగా ఐదేళ్లు సమర్థవంతంగా పనిచేశారు. వారి హయంలోనే హుస్నాబాద్ మున్సిపల్‌కు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. రెండవ సారి కూడా చైర్ పర్సన్‌గా మహిళనే వరించనుండగా.. చైర్మన్ పదవి విషయంలో మంత్రి ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. సోమవారం ఉదయం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కౌన్సిలర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం నిర్వహించి ఓటింగ్ పద్ధతిపై వివరించనున్నారు. ఈ సమావేశంలోనే చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవుల పేర్లను ప్రకటించనున్నారు. వైస్ చైర్మన్ పదవిని పురుషుడికి ఇస్తారా.. గతంలో మాదిరిగా మహిళకే ఇస్తారా? అనేది మరి కొన్ని గంటల్లో స్పష్టత రానుంది.


