రేసులో ముగ్గురు.. మురిపెం ఎవరికో..!
● మూడు పార్టీల్లోనూ ఆశావహుల యత్నాలు
● నర్సాపూర్‌లో ఎడతెగని ఉత్కంఠ
నర్సాపూర్: నర్సాపూర్ మున్సిపల్ చైర్మనన్ పదవిని దక్కించుకునేందుకు ఏ పార్టీకి సరిపడా మెజార్టీ లేనందున తలెత్తిన ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. చైర్మన్ ఎన్నికకు 8 మంది కౌన్సిలర్ల మెజార్టీ కావాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌కు ఆరుగురు, బీజేపీకి నల్గురు కౌన్సిలర్లు ఉండగా బీఆర్‌ఎస్‌కు ఐదుగురు కౌన్సిలర్లతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా స్థానిక ఎమ్మెల్యే సునీతారెడ్డి ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి క్యాంపులు చేపట్టిన ఆయా పార్టీలు ఇంకా కౌన్సిలర్లు క్యాంపులలోనే ఉన్నారు. కాగా మున్సిపల్ అధికారులు సోమవారం నిర్వహించే చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికకు ఆయా పార్టీల నాయకులు తమ కౌన్సిలర్లను నేరుగా మున్సిపల్ కార్యాలయానికి తీసుకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. ఆ పదవి కోసం కాంగ్రెస్ నుంచి 5వ వార్డు కౌన్సిలర్ ఎం.లక్ష్మిరాజు యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి 9వ వార్డు కౌన్సిలర్ వి.సునీతాబాల్‌రెడ్డి, బీజేపీ నుంచి 4వ వార్డు కౌన్సిలర్ ఏ.రాజమణి మురళీయాదవ్‌లు ఆశిస్తున్నారు. ఏ పార్టీకి సరిపడా మెజార్టీ రానందున చైర్మన్ పదవి ఆశిస్తున్న నాయకులు ఎవరికి వారు తమ పార్టీలో మద్దతు కూడగట్టుకుని ఇతర పార్టీల నుంచి మద్దతు పొందడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీకి చెందిన కొందరు నాయకులు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నారని, చైర్మన్ పదవి కోసం బీజేపీకి మద్దతిస్తే మీకు వైస్ చైర్మన్ పదవికి మద్దతిస్తామని, దీంతో ఇరు పార్టీలం కలిసి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు చేజిక్కించుకోవచ్చని చర్చలు జరుపుతున్నా ఇంకా స్పష్టత రాలేదని తెలిసింది. కాగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు సైతం ఎలాగైనా చైర్మన్ పదవిని కై వసం చేసుకోవాలన్న ఉద్దేశంతో తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారని తెలిసింది. కాగా చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను దక్కించుకుంటాయో వేచి చూడాలి.


