కాకరేపుతున్న దుబ్బాక
● రేసులో ఇద్దరు మహిళలు
● క్యాంపులోనే బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు
● 14కు చేరిన బీఆర్‌ఎస్ బలం
దుబ్బాక: స్థానిక మున్సిపల్ చైర్‌పర్సన్ ఎవరన్నది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. ఇప్పటికీ చైర్‌పర్సన్‌పై స్పష్టత లేకపోవడంతో ఎవరు అవుతారో అనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చైర్మన్ పీఠంపై కన్నేసిన 12వ వార్డు కౌన్సిలర్ బండి శ్రీలేఖ, 19వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సంగీతలు ఎలాగైనా పదవి దక్కించుకోవాలన్న పట్టుదలతో తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావుల మద్దతు ఎవరికి ఉంటుందో వారే చైర్మన్ అయ్యే అవకాశాలు ఉండడంతో వారి మెప్పు పొంది పదవి దక్కించుకునేందుకు ఇద్దరు కౌన్సిలర్లు ప్రయత్నాల్లో మునిగితేలుతున్నారు. చైర్మన్ కోసం ప్రయత్నం చేస్తున్న బండి శ్రీలేఖ గతంలో ఏఎంసీ చైర్మన్‌గా పనిచేయగా.. శ్రీరాం సంగీత సైతం దుబ్బాకకు సర్పంచ్‌గా చేశారు. దీంతో ఎవరికి ఇవ్వాలో ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి, మాజీ మంత్రి హరీశ్‌రావులకు తలనొప్పిగా మారింది. ఇద్దరి మధ్యన పోటీ తీవ్రంగా ఉండడంతో చైర్మన్ ఎంపిక ఇంకా సందిగ్ధంలోనే ఉంది.
పెరిగిన బీఆర్‌ఎస్ బలం
దుబ్బాక మున్సిపల్‌లో బీఆర్‌ఎస్‌కు కౌన్సిలర్ల బలం 14కు చేరింది. మొత్తం 20 వార్డులకు గాను 11 మంది బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందగా.. నలుగురు కాంగ్రెస్, ఇద్దరు బీజేపీ, ముగ్గురు స్వతంత్రులు విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌కు 11 మంది కౌన్సిలర్లు ఉండడంతో సొంతంగా చైర్మన్ దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇండిపెండెంట్లుగా గెలిచిన 17వ వార్డు అభ్యర్థి చాంద్‌మియా ఇప్పటికే ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. అలాగే 10వ వార్డు నుంచి గెలిచిన బడుగు రాజు, 11వ వార్డు నుంచి గెలిచిన నందాల శ్రీకాంత్ సైతం బీఆర్‌ఎస్‌కు మద్దతుగా క్యాంపుల్లో చేరారు. దీంతో ప్రస్తుతం బీఆర్‌ఎస్ క్యాంపులో 14 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ఎక్స్‌ఆఫిషి యో సభ్యుడిగా పేరు నమోదు చేసుకోవడంతో 15 మంది కోరంగా.. ఇక చైర్మన్ పీఠం ఎవరనేది మరికొన్ని గంటల వరకు వేచి చూడాల్సిందే.


