రూ.19 కోట్లు.. తాగేశారు
సిద్దిపేటకమాన్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం వ్యాపారం జోరుగా సాగింది. రెండు రోజుల్లోనే ఏకంగా రూ.19.38కోట్ల మద్యం విక్రయాలు జరగడం విశేషం. న్యూ ఇయర్ వేడుకల సెలబ్రేషన్స్ పేరిట మందుబాబులు ఫుల్లుగా తాగేశారు. దీంతో ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. గతేడాది డిసెంబర్‌లో రూ.117.86కోట్ల విక్రయాలు జరగగా.. ఈఏడాది డిసెంబర్‌లో రూ.144.76కోట్ల విక్రయాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ యేడు విక్రయాలు భారీగా పెరిగాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు ముందస్తుగా హెచ్చరించినా మందుబాబులు తగ్గేదేలే అన్నట్లుగా ప్రవర్తించారు. డిసెంబర్ 31న రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పట్టుబడిన 145మంది వాహనదారులపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
మాంసానికి భారీ గిరాకీ
మద్యంతో పాటు మాంసానికి భారీ గిరాకీ జరిగింది. డిసెంబర్ 31న ఉదయం నుంచే మాంసం దుకాణాలన్నీ కిటకిటలాడాయి. నూతన సంవత్సర వేడుకల పేరుతో మూడు రోజుల పాటు మాంసం విక్రయాలు జరిగాయి. మద్యంతో పాటు ముక్కతో యువత వేడుకల్లో మునిగితేలారు. పలు హోటళ్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. పిల్లలు, మహిళలు, యువత కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మరికొంత మంది బైక్‌లు, కార్లు, బంగారం, నూతన వస్తువులను కొనుగోలు చేశారు.
జిల్లాలో నయా కిక్కు
ఈ ఏడాది పెరిగిన మద్యం విక్రయాలు
డ్రంకెన్ డ్రైవ్‌లో 145కేసులు నమోదు
జోరుగా సాగిన మాంసం అమ్మకాలు
రెండు రోజుల్లోనే..
నూతన ఏడాది ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. బుధవారం ఒక్కరోజే రూ.11కోట్ల మద్యం తాగేశారు. డిసెంబర్ 30, 31వ తేదీల్లో రెండు రోజుల్లోనే రూ.19.38కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జిల్లాలోని 93 మద్యం దుకాణాలు, 16 బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా రెండు రోజుల్లో రూ.19కోట్ల విలువగల 16,686 కేసుల లిక్కర్, 14,555 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. గత నెలలో మొత్తం రూ.144కోట్ల76లక్షల విలువగల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది డిసెంబర్‌లో 1,15,188 కేసుల లిక్కర్, 1,69,014 కేసుల బీర్లు మొత్తం విలువ రూ.117.86కోట్ల మద్యాన్ని విక్రయించారు. గత నెలలో మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కూడా మద్యం విక్రయాలు భారీగా జరిగాయి.
రూ.19 కోట్లు.. తాగేశారు
రూ.19 కోట్లు.. తాగేశారు


