తుది దశకు కొనుగోళ్లు
వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. బహిరంగ మార్కెట్‌లో ధాన్యానికి డిమాండ్ పెద్దగా లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించేందుకు రైతులు మొగ్గు చూపారు. దీంతో మూడేళ్లలో ఈసారి కొనుగోళ్లు పెరిగాయి. జిల్లాలో 3,86,083 ఎకరాల్లో వరి సాగు చేయగా 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 365 కేంద్రాల్లో కొనుగోళ్లు ముగిశాయి. 95వేల మంది నుంచి 3.70లక్షల టన్నుల ధాన్యం సేకరించారు. మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు పూర్తి కానున్నాయి.
– సాక్షి, సిద్దిపేట
ఐదు లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లు లక్ష్యంగా జిల్లా యంత్రాంగం 421 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వానాకాలంలో 95.690 మంది రైతుల నుంచి రూ.886.31 కోట్ల విలువ చేసే 3,70,994 టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు రూ.861.97 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలలో జమ చేశారు. ఇందులో దొడ్డు రకం 3,51,300 టన్నులు, సన్నరకం 19,694 టన్నుల ధాన్యం ఉన్నాయి. ప్రభుత్వం సన్న ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని గతంలోనే ప్రకటించింది. బోనస్ రూ.9,87,08,400 కాగా ఇప్పటి వరకు 3,83,28,800 రైతులుకు అందించారు. ఇంకా రూ.5,54,39,400 బోనస్ పెండింగ్‌లో ఉంది. ఇంకా 56 కొనుగోలు కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఆ కేంద్రాలు సైతం మరో రెండు రోజుల్లో కొనుగోళ్లు ముగియనున్నాయి.
పెరిగిన కొనుగోళ్లు
గత ఏడాది వానాకాలంతో పోలిస్తే భారీగా కొనుగోళ్లు పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్ తక్కువగా ఉండటంతో రైతులు ఎక్కువగా కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించారు. దీంతో గతేడాది వానాకాలం కంటే ఈ ఏడాది 1.09లక్షల టన్నుల పెరిగాయి.
వానాకాలంలో కొనుగోళ్ల వివరాలు
సంవత్సరం టన్నులు రైతుల సంఖ్య రూ.కోట్లల్లో
2022–23 3,62,193 89,971 746.11
2023–24 3,09,026 74,160 680.77
2024–25 2,61,445 65,335 611.39
2025–26 3,70,994 95,690 886.31
3.70లక్షల టన్నుల ధాన్యం సేకరణ
ఇప్పటికే 365 కేంద్రాల్లో
ముగిసిన కాంటా
రూ.861కోట్లు రైతుల ఖాతాల్లో జమ


