బడుల్లో డిజిడల్
చాలా చోట్ల ఇంటర్నెట్ సమస్య
మరికొన్ని చోట్ల మొగ్గుచూపని
ఉపాధ్యాయులు
జిల్లాలోని 266 పాఠశాలల్లో
ఐఎఫ్‌పీల ఏర్పాటు
అంతంత మాత్రంగానే డిజిటల్ బోధన
జిల్లాలోని సర్కారు బడుల్లో విద్యార్థులకు అంతంతమాత్రంగానే డిజిటల్ బోధన అందుతోంది. అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యార్థులకు సులభంగా అర్థమవ్వాలన్న ఉద్దేశ్యంతో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్(ఐఎఫ్‌పీ)లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిజిటల్ బోధన అందుబాటులోకి తీసుకురాగా 3,684 మంది ఉపాధ్యాయులకుగాను 1,467 మంది మాత్రమే బోధన చేస్తున్నారు. మిగతా వారు పాత పద్ధతిలోనే చాక్‌పీస్‌తో బోర్డుపై రాస్తూ వివరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులు వృథాగా మారుతున్నాయి.
– సాక్షి, సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా 266 పాఠశాలల్లో 8, 9, 10వ తరగతులకు బోధించేందుకు ఒక్కో పాఠశాలకు మూడు చొప్పున 798 ఐఎఫ్‌పీలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ప్రతి ఉన్నత పాఠశాలలో డిజిటల్ టీవీల ద్వారా బోధన అందుబాటులోకి తెచ్చింది. దృశ్య శ్రవణ బోధనోపకరణాల ద్వారా ఉపాధ్యాయుడు బోధించే పాఠ్యాంశంలోని విషయాన్ని ప్రత్యక్షంగా అనుభూతి పొందడంతో అభ్యసన వేగవంతం అవుతుంది. అలాగే నేర్చుకున్న జ్ఞానం గుర్తుండిపోతుంది. ఈ అభ్యాసన లక్ష్యాలు విద్యార్థి సాధించేందుకు డిజిటల్ టీవీల ద్వారా విద్యా బోధన ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ విద్యా సంవత్సరంలో..
ఐఎఫ్‌సీలో ప్రతి ఉపాధ్యాయుడు బోధించేందుకు ఐడీ, పాస్‌వర్డ్ ద్వారా ఓపెన్ చేసి బోధించాలి. ఇలా ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 860 గంటలు మాత్రమే విద్యా బోధన చేశారు. కొన్ని పాఠశాలలు అసలే డిజిటల్ బోర్డులపై బోధించలేదని ఆ పోర్టల్‌లో నమోదైంది. మరి కొన్ని పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఐఎఫ్‌సీ ద్వారా బోధించడమే బంద్ చేశారు. ఇంకా కొన్ని చోట్ల ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో అప్పుడప్పుడు ఉపాధ్యాయుల మొబైల్ నెట్ ద్వారా వైఫై కనెక్ట్ చేసుకొని బోధిస్తున్నారు. అత్యల్పంగా నారాయణరావు పేట మండలంలో మొత్తంగా ఒక గంట మాత్రమే బోధించారు. అత్యధికంగా చేర్యాల మండలంలో బోధించారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు దృష్టి సారించి ఐఎఫ్‌పీల ద్వారా బోధించేలా కృషి చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మద్దురు మండలం లద్నూర్ ప్రభుత్వ పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడంతో ఉపాధ్యాయురాలు మొబైల్ ఫోన్ హాట్‌స్పాట్‌తో బోధిస్తున్నారు. అప్పుడప్పుడు నెట్ సరిగా రాకపోవడంతో అంతరాయం ఏర్పడుతుంది.
నారాయణరావు పేట మండలం గుర్రాలగొంది పాఠశాలలో ఉపాధ్యాయులు లాగిన్ కాకుండానే బోధిస్తున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో ఏర్పాటు చేసిన పాఠాలను బోధించలేకపోతున్నారు.
హుస్నాబాద్ మండలం పోతారం ప్రభుత్వ పాఠశాలలోని 8వ తరగతిలో ఏర్పాటు చేసిన ఐఎఫ్‌సీ పని చేయకపోవడంతో మళ్లీ సాధారణంగా బ్లాక్ బోర్డు పైనే బోధిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసినా నిరుపయోగంగా మారింది.
వినియోగించని వారిపై చర్యలు
ఉత్తమ బోధనలు అందించాలన్న ఉదేశ్యంతో ప్రభుత్వం ఐఎఫ్‌పీ బోర్డులను 8, 9,10వ తరగతులలో ఏర్పాటు చేసింది. ఐఎఫ్‌పీ ద్వారా బోధించని ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటాం. అన్ని పాఠశాలల్లో పనితీరును త్వరలో పరిశీలిస్తాను. – శ్రీనివాస్‌రెడ్డి, డీఈఓ


