నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం
కలెక్టర్ హైమావతి
రహదారి భద్రతా
మాసోత్సవాలు ప్రారంభం
సిద్దిపేట రూరల్: ప్రతి ఒక్కరూ విధిగా రహదారి నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని కలెక్టర్ హైమావతి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మసోత్సవాలు, సడక్ సురక్ష అభియాన్ కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 31 వరకు ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలన్నారు. పలు విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రతి అధికారి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రతా మాసోత్సవాల సంబంధించి ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, ఆర్టీఏ కమిటీ సభ్యుడు డాక్టర్ సూర్య వర్మ, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.


