వేదికలు కావవి.. రైతు వేదనలు
సమస్యలు తిష్ట వేసినా పట్టించుకోని ప్రభుత్వం చాలా చోట్ల నిరుపయోగంగా వేదికలు
నంగునూరు(సిద్దిపేట): రైతుల సౌకర్యార్థం గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికల్లో పలు సమస్యలు వేధిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యా రు. కనీసం తాగడానికి నీరు లేక, మరుగుదొడ్లు వినియోగంలోకి రాక అన్నదాతల పాట్లు అన్నీఇన్నీకావు. క్లష్టర్ పరిధిలో నిర్వహించే సమావేశాలకు వచ్చి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివిధ గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నదాతల సౌలభ్యం కోసం ప్రభుత్వం 2021లో జిల్లా వ్యాప్తంగా 126 రైతు వేదికలు ఏర్పాటు చేసింది. అందులో 76 వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు (వీసీయూ) ఉన్నాయి.
గ్రామాలకు దూరంగా..
చాలా రైతు వేదికలు గ్రామాలకు దూరంగా ఉండడంతో నీటి సరఫరా లేక ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా మహిళ ఏఈఓలు ఎక్కువగా ఉండడంతో వారు అనేక ఇబ్బందులు పడుతున్నారు. నీటి వసతి లేక.. టాయిలెట్లను శుభ్రం చేసే వారు లేక నిరుపయోగంగా మారాయి. రైతు వేదికలకు మిషన్ భగీరథ నీటిని సరఫరా చేయాలని అధికారులు ఆదేశించినప్పటికీ కనెక్షన్లు ఇవ్వకపోవడంతో తాగునీటి సమస్య వేధిస్తోంది. అలాగే వీటి నిర్వహణ గ్రామపంచాయతీ పరిధిలో లేకపోవడం, ఏఈఓ ల పర్యవేక్షణలో ఉండడంతో సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. 5 వేల ఎకరాల్లో పంట సాగు ఆధారంగా సమీప గ్రామాలను క్లష్టర్ పరిధిలో చేర్చారు. వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) రైతుల వేదికలో అందుబాటులో ఉంటూ సీజన్ల వారీగా పంటల నమోదు, పథకాలపై అవగాహన కల్పిస్తున్నారు.
వేధిస్తున్న నీటి సమస్య
రైతు వేదికలో పంటల సాగు, చీడ పీడల నివారణ, ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు, ఆధునిక సాగు పద్ధతులపై శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వసతులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. ట్యాంక్‌లు చాల గ్రామాల్లో ధ్వంసం కావడంతో నల్లాలు, టాయిలెట్లు, వాష్‌బేసిన్లు పని చేయక చెత్త, చెదారంతో నిండిపోయాయి.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
రైతు వేదికల్లో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వాటర్ ట్యాంక్‌లను కోతులు ధ్వంసం చేయడంతో నీటి సమస్య నెలకొంది. దీంతో టాయిలెట్లు, వాష్‌రూమ్స్ నిరుపయోగంగా మారాయి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నాం.
– గీత, వ్యవసాయ అధికారి, నంగునూరు
వసతులు లేక తప్పని అవస్థలు


