హాజరు శాతం పెంచాలి
● తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ● కలెక్టర్ హైమావతి
చిన్నకోడూరు(సిద్దిపేట): తరగతి గదుల్లోనే విద్యార్థుల భవిష్యత్ ఉందని, విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ మోడల్ స్కూల్‌ను, ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. బియ్యం, కూరగాయల నాణ్యత ఎలా ఉంటుందని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల హాజరు శాంత పెంచాలని సూచించారు. చదువు విషయంలో రాజీ పడవద్దని, ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి నిరంతరం శ్రమించాలన్నారు. కాగా, ఇబ్రహీంనగర్‌లోని పీహెచ్‌సీని కలెక్టర్ తనిఖీ చేశారు.
వీది కుక్కలను నియంత్రించండి
సిద్దిపేటరూరల్: జిల్లాలో వీధి కుక్కల నియంత్రణతో పాటుగా వాటికి షెల్టర్ నిర్మించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హల్‌లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పోలీస్, గ్రామపంచాయతీ, మున్సిపల్, వైద్య ఆరోగ్య, విద్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ అధికారులతో కుక్కల నియంత్రణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ..కుక్కల నియంత్రణకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మున్సిపాలిటీల్లో, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల షెల్టర్ హోమ్‌ను నిర్మించి అక్కడికి తరలించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి కొండల్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్, డీపీఓ రవీందర్, జిల్లా వైద్యాధికారి ధనరాజ్, డీటీఓ లక్ష్మణ్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి వెంకట నర్సయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.


