జాతీయ ఆర్థిక సదస్సుకు డాక్టర్ రమేష్
కోహెడరూరల్(హుస్నాబాద్): చైన్నెలోని వేల్స్ యూనివర్సిటీలో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న 108వ ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ వార్షిక సదస్సుకు ఎకనామిక్స్ అధ్యాపకుడు డాక్టర్ జాలిగం రమేష్ హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక రంగ నిపుణులు, మేధావులు పాల్గొనే ఈ ప్రతిష్టాత్మక సదస్సు ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనుంది. కాగా, సదస్సులో భాగంగా డాక్టర్ రమేష్ భారతదేశంలో పంటల ఉత్పాదకత, స్థిరమైన వ్యవసాయంపై నీటిపారుదల వ్యవస్థల ప్రభావం అనే పత్రాన్ని సమర్పించనున్నారు. దేశంలోని సాగునీటి వసతులు, పంటల దిగుబడిని పెంచడంలో నీటి పారుదల పాత్ర, పర్యావరణహిత వ్యవసాయ పద్ధతులపై ఆయన చేసిన లోతయిన విశ్లేషణను వివరించనున్నారు. జాతీయ స్థాయి వేదికపై పరిశోధన పత్రాన్ని సమర్పించే అవకాశం రావడం పట్ల పలువురు విద్యావేత్తలు డాక్టర్ రమేష్‌ను అభినందించారు.


