‘సంక్షేమం’తో గొప్ప పరివర్తన
నిధుల కోసం సీఎంతో మాట్లాడతాం కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగాశ్రేణులు పనిచేయాలి మంత్రులు వివేక్, పొన్నం గజ్వేల్‌లో కాంగ్రెస్ సర్పంచ్‌లకు సన్మానం
గజ్వేల్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న సంక్షేమ పథకాలతో గ్రామీణ సమాజంలో గొప్ప పరివర్తన వస్తుందని మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం గజ్వేల్‌లోని ఎస్‌ఎమ్ గార్డెన్స్‌లో డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిల ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ సర్పంచ్‌లను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రులు వివేక్, పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, రూ.2లక్షల రుణమాఫీతోపాటు ఇతర పథకాలతో చక్కటి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తమ సత్తాను చాటుకున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. గజ్వేల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మన సొంతం కావాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిగా శ్రమించాలన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన అభివృద్ధి నిధుల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అదనంగా ఇందిరమ్మ ఇళ్లు కూడా కావాలని కోరుతామన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ త్వరలోనే గెలిచిన సర్పంచ్‌లతో సీఎంను కలిసేలా అవకాశం కల్పించాలని కోరారు. కాంగ్రెస్ గజ్వేల్ నియోజకవర్గ ప్రచార కమిటీ కన్వీనర్ రంగారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయమోహన్, సర్ధార్‌ఖాన్, ప్రభాకర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
మెస్ బిల్లులు విడుదల చేయండి
కాగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీతోపాటు కస్తుర్బా హాస్టళ్లల్లో ఆరు నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెస్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు తాటికొండ రవి మంత్రికి వినతి పత్రం అందజేశారు.
బీఆర్‌ఎస్ భూస్థాపితం
ఖాయం: మంత్రి వివేక్
తన సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోవడంతో భయానికి గురైన కేసీఆర్ తోలు తీస్తా అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని మంత్రి వివేక్ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ అధినేత ‘ఇలాకా’గజ్వేల్‌లో కాంగ్రెస్ రోజురోజుకూ పుంజుకుంటున్నదని చెప్పారు. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల కృషి వల్ల అత్యధిక సర్పంచ్ స్థానాలను ఇక్కడ గెలుచుకోగలిగామని చెప్పారు. రాబోవు మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతోపాటు అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలే పునరావృతమవుతాయని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయమని జోస్యం చెప్పారు.


