పులి సంచారం
అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
మిరుదొడ్డి(దుబ్బాక): పులి సంచరిస్తోందని, ఆయా గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. మిరుదొడ్డి, తొగుట మండలాల శివారులోని పంట పొలాల్లో శుక్రవారం పులి సంచరిస్తున్నట్లు రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అటవీ శాఖ రేంజ్ అధికారి సందీప్ కుమార్ నేతృత్వంలో సంఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. పులి పాద ముద్రలను గుర్తించారు. పాద ముద్రల ఆధారంగా పులి సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. మిరుదొడ్డి మండలంలోని కొండాపూర్, అందె, తొగుట మండలంలోని గోవర్ధన గిరి, ముత్యం పేట గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఆయా గ్రామాల రైతులు తమ వ్యవసాయ పొలాలకు ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. సాయంత్రం కాగానే తమ ఇళ్లలోకి చేరుకోవాలని కోరారు. పాడి పశువులను వ్యవసాయ పొలాల వద్ద కాకుండా ఇండ్ల వద్ద కట్టేసుకోవాలని అవగాహన కలిగించారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పులి కదలికలను పసిగట్టి పట్టుకుంటామని అధికారులు వెల్లడించారు.
అధికారులు గుర్తించిన పులి పాద ముద్ర
పులి సంచారం


