పాల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలుద్దాం
● మరిన్ని సహకార సంఘాల ఏర్పాటు ● పాఠశాల ఆవరణలో మద్యం సేవిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేయండి ● మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌రూరల్: నియోజకవర్గాన్ని పాల ఉత్పత్తిలో, పశుసంపదలో అగ్రగామిగా నిలబెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో ఏడు మండలాల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. హుస్నాబాద్ నియోజకవర్గం గ్రామీణ ప్రాంతం కావడంతో రైతులు పాల ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తారన్నారు. అలాగే ప్రభుత్వ సంక్షేమాలు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాఠశాలల ఆవరణలో మద్యం సేవించే వారిపై రౌడీ షీటు ఓపెన్ చేయాలని సిద్దిపేట, హన్మకొండ, కరీంనగర్ జిల్లా సీపీలను ఆదేశించారు. గ్రామాల్లో ఏడు మెడికల్ కాలేజీల ద్వారా సంక్రాంతి లోపు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. యాసంగి పంటల సీజన్ ప్రారంభం కావడంతో గ్రామాల్లో రైతులకు పంటల సాగుపై అవగహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో మరిన్ని సహకార సంఘాలను ఏర్పాటు చేసి అదనపు గోదాములను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమవేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి, మార్కెట్ చైర్మన్ తిరుపతిరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
గొర్రెలకు నట్టల మందు వేయండి
హుస్నాబాద్‌రూరల్: గొర్రెల మంద పెరిగితే ఆదాయం వృద్ధి చెందుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం తోటపల్లిలో గొర్రెలకు నట్టల మందు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గొర్రెల మంద ఎదగాలంటే జీవాల ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్య సమస్యలను గుర్తించి సమీపంలోని పశువైద్యులను సంప్రదించి వైద్యం అందించాలన్నారు. జీవాలు ఆరోగ్యంగా ఉంటే మంద పెరుగుతుందన్నారు. అప్పుడు ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పారు. జీవాల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దన్నారు. ఊరూర గొర్రెల మందలను గుర్తించి గొర్రెల పెంపకముదారులకు అవగహన కల్పించాలని అధికారులకు సూచించారు.


