చరిత్ర ఘనం.. చర్చిలు అబ్బురం
నేడే క్రిస్మస్ పండుగ.. వేడుకలకు సర్వం సిద్ధం
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ఇంగ్లండ్ మిషనరీలు జిల్లా కేంద్రంలో నిర్మించిన తొలి సీఎస్‌ఐ చర్చి ఇది. చర్చికి 137 ఏళ్ల చరిత్ర ఉంది. స్వాతంత్య్రం రాకముందే నిర్మించిన ఈ చర్చి జిల్లాలోనే అతి పెద్దది, విశాలమైనది. ఒకేసారి వెయ్యి మందికి పైగా భక్తులు ప్రార్థనలు చేసుకునే అవకాశం ఉంది. క్రిస్మస్ రోజున జిల్లాతో పాటుగా, రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన భక్తులు ఈ చర్చికి అధిక సంఖ్యలో తరలివస్తారు. ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. సిద్దిపేట ప్రాంతంలో ఎలాంటి చర్చి లేనందున ప్రత్యేక శ్రద్ధతో సీఎస్‌ఐ చర్చి నిర్మాణం చేశారని నిర్వాహకులు చెబుతున్నారు. పట్టణం మధ్యలో మొదట చిన్న పాకగా.. ఆ తరువాత రేకుల షెడ్డుగా.. అనంతరం భారీ చర్చిని నిర్మించారని వారు తెలిపారు.
వేడుకలు వైభవంగా నిర్వహిస్తాం
జిల్లాలోనే పురాతనమైనది సీఎస్‌ఐ చర్చి. ఇంగ్లండ్ మిషనరీలు ఈ చర్చిని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. సిద్దిపేట పరిసరాల ప్రజలకు చర్చి అందుబాటులో లేనపుడు ఇక్కడ నిర్మించారు. ఈ చర్చికి వేలాది భక్తులు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ చర్చిలో వైభవంగా వేడుకలు నిర్వహిస్తాం. – రెవరెండ్ ఆంథోని, సీఎస్‌ఐ చర్చి
జిల్లాలోనే ప్రథమం.. 137 ఏళ్ల ప్రస్థానం


