ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేస్తుండ్రు
మరింత మెరుగైన వైద్య సేవలు
జిల్లాకు రానున్న 60 మంది
● ఇటీవల మెరిట్ జాబితా విడుదల ● డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, డీహెచ్‌కు కేటాయింపులు
సిద్దిపేటకమాన్: జిల్లాకు 60 మంది నూతన ల్యాబ్ టెక్నీషియన్లు రానున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలు మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశ్యంతో ల్యాబ్ టెక్నీషియన్లను రాష్ట్ర ప్రభుత్వం రిక్రూట్ చేసింది. మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) 2024 నవంబర్ 10న రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష నిర్వహించింది. ఉత్తీర్ణత సాధించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారి సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈ ఏడాది నవంబర్ 17న తుది జాబితాను వెలువరించింది. ఎంపికైన అభ్యర్థులకు మూడు రోజుల క్రితం పోస్టింగ్‌లను కేటాయించారు. వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రులకు వచ్చే వారిలో అవసరమైన వారికి రక్త పరీక్షలు నిర్వహించి, వెంటనే ఫలితాలు అందించే అవకాశం ఉంది.
జిల్లాలో పోస్టుల భర్తీ
జిల్లాలో ఖాళీగా ఉన్న 60 గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేశారు. మెడికల్ హెల్త్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ బోర్డు డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింద ల్యాబ్ టెక్నీషిన్లను నియమించింది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు 15మంది, అనుబంధ జనరల్ ఆస్పత్రికి ఆరుగురు, డీహెచ్ పరిధిలోని పలు పీహెచ్‌సీల్లో 25మంది, వైద్య విధాన పరిషత్ పరిధిలో 14మందిని నియమించారు. వీరు రెండు, మూడు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. ఈ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల్లో ప్రస్తుతం అవుట్ సోర్సింగ్ ఒప్పంద పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లను రెగ్యులర్ చేయనున్నారు. ఈ క్రమంలో నియామక ప్రక్రియలో 20మార్కుల వెయిటేజీ కల్పించారు.
నూతనంగా జిల్లాకు 60 మంది ల్యాబ్ టెక్నీషియన్లు రానుండడంతో వైద్య సేవలు మరింత పెరగనున్నాయి. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి ప్రభుత్వాస్పత్రులకు వచ్చే వారు రక్త పరీక్షలు, రిపోర్టుల కోసం ఎదురుచూపులు తప్పనున్నాయి. ప్రైవేటుకు వెళ్లకుండా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. అదేవిదంగా నూతనంగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైన ల్యాబ్ టెక్నీషియన్లు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సంతోషంగా ఉంది
సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి, బ్లడ్ బ్యాంకులో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో 18ఏళ్లుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాను. గత ఏడాది నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తుది జాబితాలో ఉద్యోగానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది.
– కనకచంద్రం, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2
ల్యాబ్ టెక్నీషియన్లు వచ్చేస్తుండ్రు


