
నిమజ్జనానికి ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ హైమావతి ● పలు శాఖల అధికారులతో సమావేశం
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహాల నిమజ్జనాలు 4, 5, 6వ తేదీల్లో జరుగుతున్నందున మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో పోలీస్, మున్సిపల్, ఎలక్ట్రిసిటీ, ఎక్సైజ్ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిమజ్జనాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. కోమటిచెరువు, చింతలచెరువు, నర్సాపూర్ చెరువు వద్ద నిమజ్జనాలకు క్రేన్లను ఏర్పాటు చేసి, అనంతరం క్లీన్ చేయాలన్నారు. గ్రామాల్లో తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులు చెరువులు, కుంటలు నిండిన క్రమంలో రాత్రి వేళల్లో కాకుండా పగటి వేళల్లో నిమజ్జనాలు చేసేలా చూడాలన్నారు. సమావేశంలో అదనపు డీసీసీ అడ్మిన్ కుశాల్కర్, ఏసీపీ సదానందం, రవీందర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, విద్యుత్‌శాఖ అధికారులు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించాలి
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రోడ్డు భద్రతా కమిటీ, మత్తుపదార్థాల వినియోగ నివారణపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలన్నారు. ప్రతీ గ్రామంలో రోడ్డు దాటేందుకు ఒకే డివైడర్ ఉండాలని, అనధికారికంగా రోడ్డు తొలగిస్తే కఠినంగా వ్యవహరించాలన్నారు. ఎక్కడైనా మత్తుపదార్థాలు విక్రయిస్తే వెంటనే 1908 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
జీపీఓలను నియమిస్తాం
సిద్దిపేటరూరల్: జిల్లా వ్యాప్తంగా ఎంపికై నా 150 మంది జీపీఓ (గ్రామ పరిపాలన అధికారి)లకు కౌన్సెలింగ్ నిర్వహించి గ్రామాలకు నియమిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. బుధవారం హైదరాబాద్ నుంచి చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్‌ఏ) లోకేష్ కుమార్ జీపీఓల నియామకాలపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీపీఓలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం వారికి పోస్టింగ్ ఇస్తామన్నారు.