హస్తవ్యస్తం | - | Sakshi
Sakshi News home page

హస్తవ్యస్తం

Aug 20 2025 9:33 AM | Updated on Aug 20 2025 9:33 AM

హస్తవ

హస్తవ్యస్తం

గజ్వేల్‌ కాంగ్రెస్‌లో గ్రూప్‌ వార్‌

గజ్వేల్‌ కాంగ్రెస్‌లో గ్రూప్‌ వార్‌ రచ్చకెక్కుతోంది. సొంత పార్టీ నేతలే ఒకరిపైఒకరు కేసులు పెట్టుకునే స్థితికి చేరింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు మధ్య కొంతకాలంగా పోరు నడుస్తోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వర్గం తయారైంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవికి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో స్పందించి నివేదిక కోసం క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యాంమోహన్‌ను కన్వీనర్‌గా నియమించారు. పది రోజుల్లో నివేదిక ఇవ్వాలని మల్లు రవి ఆదేశించారు.

– సాక్షి, సిద్దిపేట

ములుగులో గతేడాది డిసెంబర్‌ 2న కోకాకోలా కంెపెనీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. లోపలికి శ్రీకాంత్‌ రావు అనుచరులను అనుమతించారని.. తన అనుచరులను రానివ్వలేదని మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నిరసన తెలిపారు. గజ్వేల్‌ పట్టణంలో ఈ నెల 3న రేషన్‌ కార్డుల ప్రొసీడింగ్స్‌ పంపిణీ కార్యక్రమంలో ఇన్‌చార్జి మంత్రి గడ్డం వివేక్‌ ఎదుటే కాంగ్రెస్‌ నాయకులు బాహాబాహీకి దిగారు. నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న సీనియర్‌ నాయకుడు నాయిని యాదగిరి, కాంగ్రెస్‌ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌లు ఘర్షణకు దిగారు.

దిష్టిబొమ్మల దహనాలు

కేసుల నమోదు వెనకాల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు హస్తం ఉందని నర్సారెడ్డి వర్గీయులు నిరసనలు చేపడుతున్నారు. కొండపాక మండలం వెలికట్ట క్రాస్‌ రాజీవ్‌ రహదారిపై మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. కాంగ్రెస్‌ నాయకులు మల్లేశం, రవీందర్‌ల ఆధ్వర్యంలో ఈ నెల 17న టోల్‌ప్లాజా నుంచి వెలికట్ట క్రాస్‌ రోడ్డు వరకు నర్సారెడ్డి దిష్టిబొమ్మను ఊరేగింపుగా తీసుకవచ్చి దహనం చేశారు. ఇలా సొంత పార్టీ నేతలే పరస్పర విమర్శలతో రోడ్డెక్కుతూ దిష్టిబొమ్మల దహనానికి పాల్పడుతుండటం గమనార్హం. వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్‌ నేతల మధ్య రోజు రోజుకు కలహాలు ముదురుతున్నాయి. విభేదాలు పరిష్కరించడంలో కాంగ్రెస్‌ అధిష్టానం జాప్యం చేస్తోందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.

వర్గాలు ఒక్కటయ్యేనా

గజ్వేల్‌ కాంగ్రెస్‌లో కొంత కాలంగా వర్గపోరు కొనసాగుతోంది. ఈ విషయం పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ మల్లు రవికి పలువురు ఫిర్యాదు చేయడంతో క్రమశిక్షణ కమిటీ సభ్యుడు శ్యాంమోహన్‌ను కన్వీనర్‌గా నియమించారు. 10 రోజుల్లో సమగ్ర నివేదికను ఇవ్వాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే.. కావాలని ఒక వర్గం కుట్రలకు పాల్పడుతోందని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టి వర్గాలను ఒక్కటి చేసి పార్టీని పటిష్ట పరచాలని క్యాడర్‌ కోరుతోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించేందుకు కృషి చేయాలని ఆ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు.

ఇటీవల ఇన్‌చార్జి మంత్రి ఎదుటే నేతల బాహాబాహీ

ఒకరిపై ఒకరు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదులు

నర్సారెడ్డి, మైనంపల్లి దిష్టిబొమ్మల దహనాలు

నివేదిక కోసం క్రమశిక్షణ కమిటీ సభ్యుడి నియామకం

కొనసాగుతున్న ఫిర్యాదుల పర్వం

గజ్వేల్‌: కాంగ్రెస్‌లో ఫిర్యాదుల పర్వం కొనసాగుతూనే ఉంది. డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డితోపాటు పలువురు నేతలు సోమవారం పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ను కలిసి పార్టీ ఎస్సీసెల్‌ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌పై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం నర్సారెడ్డిని వ్యతిరేకిస్తున్న నేతలు నాయిని యాదగిరి, ఆత్మ కమిటీ చైర్మన్‌ మల్లారెడ్డితోపాటు పలువురు హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ను కలిశారు. విజయ్‌కుమార్‌పై నర్సారెడ్డి చేసిన ఆరోపణలన్నీ అబద్దాలేనని వివరించారు. పార్టీలో నేతలంతా రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్న నేపథ్యంలో గజ్వేల్‌ కాంగ్రెస్‌లో ఏం జరుగుతుందనే అంశంపై అధిష్టానం సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.

హస్తవ్యస్తం1
1/1

హస్తవ్యస్తం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement