
ప్రభుత్వాల వైఫల్యమే కారణం
● సకాలంలో యూరియా సరఫరా చేయాలి
● దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కొరతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆరోపించారు. యూరియా కొరత సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం అక్బర్‌పేట–భూంపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలుకు ముందు చూపు లేకనే యూరియా కొరత ఏర్పడుతోందని విమర్శించారు. రైతులు యూరియా కోసం పస్తులతో పోరాటం చేస్తుంటే కాంగ్రెస్ ప్రభత్వుం ఏం చేస్తోందని మండిపడ్డారు. వెంటనే యూరియా కొరతను తీర్చే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు రైతులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింపజేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు కమలాకర్‌రెడ్డి, సోలిపేట సతీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి, మాజీ కోఅప్షన్ మెంబర్ ఎండీ. అహ్మద్, నాయకులు పాల్గొన్నారు.
రాజీవ్ రహదారిపై బీఆర్‌ఎస్ రాస్తారోకో
చిన్నకోడూరు(సిద్దిపేట): యూరియా కొరత నివారించాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఇబ్రహీంనగర్ వద్ద రాజీవ్‌రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు. గంట పాటు నిర్వహించడంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎరువుల సరఫరాలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్‌లు, మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
అక్కన్నపేటలో బారులు
అక్కన్నపేట(హుస్నాబాద్): వరిసాగుకు అవసరమైన యూరియా సరఫరా లేక రైతులు అవస్థలు పడుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రానికి స్టాక్ రావడంతో రైతులు అక్కడికి చేరుకున్నారు. దీంతో తీవ్ర రద్దీ ఏర్పడింది. రైతులు తమ వంతుకోసం గంటల కొద్దీ నిరీక్షించారు. పోలీసు బందోబస్తు నడుమ యూరియా పంపిణీ చేశారు.

ప్రభుత్వాల వైఫల్యమే కారణం