
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● కలెక్టర్ హైమావతి
● దిలాల్‌పూర్‌లో తెగిపోయిన కొండపోచమ్మసాగర్ కాల్వ పరిశీలన
గజ్వేల్: భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మంగళవారం గజ్వేల్ మండలం దిలాల్‌పూర్‌లో తెగిపోయిన దౌల్తాబాద్‌వైపు వెళ్లే కొండపోచమ్మసాగర్ కాల్వను పరిశీలించారు. కాల్వ నీళ్లు పొలాల గుండా కుంటలోకి వెళ్తున్నాయని ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు వివరించగా వెంటనే కాల్వ పునరుద్ధరణ పనులు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో వరద ఉధృతి పెరిగి చెరువులు, కుంటలు, కాల్వలు తెగిపోయే ప్రమాదమున్నందువల్ల ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
వరదలో వాగులను దాటొద్దు
మిరుదొడ్డి(దుబ్బాక): ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ హైమావతి కోరారు. మంగళవారం అల్వాల శివారు కూడవెల్లి వాగుపై ఉన్న లో లెవల్ బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తున్న వరద నీటిని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ లో లెవల్ బ్రిడ్జిలపై నుంచి ప్రవహిస్తున్న వాగుల వద్ద ప్రత్యేకంగా బారికెడ్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చర్య లు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నర్సరీ పరిశీలన
ములుగు(గజ్వేల్): స్థానిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్రూట్స్, రైతు శిక్షణ కేంద్రంలోని నర్సరీలను కలెక్టర్ హైమావతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. కూరగాయలు, పండ్లు, పూలు ఇతరత్ర మొక్కలు సాంకేతిక పద్ధతి ద్వారా మొలిచే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. దేశీరకం వంగడాలతో కూడిన మొక్కలను నర్సరీలలో పెంచాలని కలెక్టర్ సిబ్బందికి సూచించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.