
ఉద్యాన ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధిద్దాం
● పరిశోధనలు విస్తృతంగా సాగాలి
● మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
ములుగు(గజ్వేల్): ‘ఉద్యాన ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం పరిశోధనలపై విశ్వవిద్యాలయాలు దృష్టి సారించాలి. తద్వార ఇతర రాష్ట్రాలపై ఆధార పడటం తగ్గించాలి’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం ములుగులోని ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని మంత్రి సందర్శించారు. ఈసందర్భంగా రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, కలెక్టర్ హైమావతి, వర్సిటీ వైస్ చాన్స్‌లర్ రాజిరెడ్డి, వ్యవసాయ శాఖ సంచాలకులు రఘునందన్‌రావు, రైతు సంక్షేమ కమిషన్ బోర్డు సభ్యురాలు భవానీరెడ్డిలతో కలసి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిర్మించిన సెంట్రల్ డైనింగ్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి, ఉద్యాన ప్రాసెసింగ్, మార్కెటింగ్ సౌకర్యాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థులు స్వయాన పొలాల్లోకి వెళ్లి రైతుల పని విధానాన్ని పరిశీలించాలన్నారు. రాబోయే రోజుల్లో అన్నిరంగాల కంటే వ్యవసాయ రంగానికే అధిక ప్రాముఖ్యత ఉంటుందని మంత్రి తెలిపారు. ఉప్పెనలు, ఉపద్రవాలు వచ్చినా దేశ ప్రజలను బతికించగలిగే ఏకై క రంగం వ్యవసాయమన్నారు. ఉద్యాన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎక్కువగా క్షేత్ర అనుభవాన్ని పొందాలని, రైతులతో చురుకుగా సంభాషించి సాంకేతిక మార్గ దర్శకం అందించాలన్నారు. కార్యక్రమంలో గజ్వేల్, ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్‌లు నరేందర్‌రెడ్డి, విజయమోహన్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.