
కుమ్మేసిన
వర్గల్(గజ్వేల్): భారీ వర్షం అతలాకుతులం చేసింది. మున్నెన్నడులేని అతిభారీ వర్షంతో హల్దీవాగు ఉగ్రరూపం దాల్చింది. వరద తాకిడికి ఖాన్‌చెరువు ఉప్పొంగింది. నాచగిరి వద్ద హరిద్రనది పొంగిపొర్లింది. రోడ్లపై రాకపోకలకు స్తంభించిపోయాయి. చందాపూర్ వద్ద రోడ్డు మీదుగా వరద ఉధృతితో గ్రామానికి వెళ్లే దారి మూతపడింది. వర్గల్ మండల వ్యాప్తంగా ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన కుండపోత వర్షంతో పంటపొలాలు నీట మునిగి చెరువులను తలపించాయి. వర్గల్ మండలం గౌరారంలో రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో 23.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండల వ్యాప్తంగా 22.8 సెంటీమీటర్ల వర్షం పడగా.. మొక్కజొన్న, పత్తి, వరి పైర్లు వరదనీటిలో మునకేశాయి. అంబర్‌పేట–శాకారం రోడ్డుపై భారీగా ఖాన్‌చెరువు నీరు నిలవడంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఒక వాహనం నీటి మధ్యలో నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్లు, జేసీబీలతో గట్టెక్కించారు. పోలీసులు రాకపోకలను నిలిపేశారు. చందాపూర్–బొర్రగూడెం మార్గంలో లోలెవెల్ కల్వర్టు వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో చందాపూర్‌కు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గౌరారంలో పలువురి ఇళ్లలో నీరు చేరడంతో ఇబ్బందిపడ్డారు. రాజీవ్‌రహదారిపైకి వరద ప్రవహించడంతో వాహనాల రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. చెరువులన్నీ మత్తడి దూకుతున్నాయి. కాగా మండలంలో 2,945 ఎకరాల్లో వరి, 237 ఎకరాల పత్తి, 81 ఎకరాల్లో మొక్కజొన్న, 129 ఎకరాలలో కూరగాయ తోటలు నీటిలో మునిగిపోయినట్లు ప్రాథమిక అంచనా వేసినట్లు ఏఓ శేషశయన తెలిపారు.
వర్షంలోనే కలెక్టర్ పర్యటన
వర్గల్ మండలంలో వర్ష తీవ్రత, పంటల స్థితిగతి, జలాశయాలు, రవాణాపరమైన ఇబ్బందులు పరిశీలించేందుకు సోమవారం కలెక్టర్ హైమావతి, గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళతో కలిసి పర్యటించారు. వర్షం లెక్కచేయకుండా గొడుగు పట్టుకుని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు ఎక్కడికక్కడ దిశానిర్దేశం చేశారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అంబర్‌పేట ఖాన్‌చెరువు, వేలూరు రంగం చెరువు, సీతారాంపల్లి తదితర ప్రాంతాలు పర్యటించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
యూరియా, ఎరువల లభ్యతపై మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ హైమావతి పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడుతూ జిల్లాకు ప్రభుత్వం సరాఫరా చేస్తున్న యూరియాను సరిగ్గా చేర్చేందుకు కావాల్సిన ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. అవసరమైన యూరియాను త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అతిభారీ వర్షం.. రాష్ట్రంలోనే అత్యధికం
గౌరారంలో 23.6 సెం.మీ వర్షపాతం నమోదు
మునిగిన పంటలు.. ఉప్పొంగిన వాగులు, చెరువులు
ముంపు పొలాలు, రోడ్లను పరిశీలించిన కలెక్టర్
నేడు పాఠశాలల బంద్
సిద్దిపేటరూరల్: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వర్గల్, మర్కుక్, జగదేవపూర్, గజ్వేల్, కుకునూరుపల్లి, కొమురవెల్లి, మిరుదొడ్డి మండలాల్లో వాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. అతిభారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించదని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని సూచించారు. ఎలాంటి అవసరానికై నా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 08457–230000 ను సంప్రదించాలని ఆమె కోరారు.

కుమ్మేసిన

కుమ్మేసిన

కుమ్మేసిన

కుమ్మేసిన