
రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు
అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్
కొమురవెల్లి(సిద్దిపేట)/మర్కూక్(గజ్వేల్): కొమురవెల్లి మండలంలో పలు చెరువులు నిండడంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ సూచించారు. మండలంలోని పోసాన్‌పల్లి గుండ్ల చెరువుతోపాటు పలు చెరువులను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మండలంలో ఆదివారం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. చేబర్తి నుండి పాతూరు వెళ్లే రోడ్డును అదనపు కలెక్టర్ పరిశీలించారు. వరద ఉధృతి ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని, వరద తగ్గిన వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రంలో తహసీల్దార్ ప్రవీణ్‌రెడ్డి, ఎంపీడీఓ అశోక్, ఎంపీఓ సత్యనారాయణ, ఇరిగేషన్ డీఈ శ్రీధర్, ఏఈ అభిలాష్, రైతులు పాల్గొన్నారు.
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన పులికాశీ వంశీకృష్ణ రాష్ట్ర కబడ్డీ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యారు. సోమవారం రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. క్రీడలకు పుట్టినిల్లుగా చౌటపల్లి గ్రామంలో అనేక మంది వివిధ క్రీడల్లో రాణిస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ప్రో కబడ్డీ క్రీడాకారుడు గంగాధరి మల్లేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షు డు జంగపల్లి అయిలయ్య, యూత్ నాయకులు చుంచు రాకేష్, పులికాశీ రమేష్ పాల్గొన్నారు.
తొగుట(దుబ్బాక): కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూడవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని దుబ్బాక నీటిపారుదల శాఖ డీఈఈ చెన్ను శ్రీనివాస్‌రావు తెలిపారు. మండలంలోని కూడవెల్లి వాగుతో పాటు గ్రామాల్లో చెరువులను సోమవారం పరిశీలించారు. చేపలు పట్టేవారు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మండలంలో 142 చెరువులు, కుంటలు ఉన్నాయని అందులో 29 ఇప్పటికే నిండి అలుగు పారుతున్నాయని చెప్పారు. వర్షం కురుస్తుండటంతో వరద పెరిగి వాగులోకి నీరు ప్రవహిస్తుందన్నారు. రైతులు, గొర్లకాపరులు వాగులోకి వెళ్లొద్దని సూచించారు. కార్యక్రమంలో ఏఈ అస్మజబీన్, సిబ్బంది పాల్గొన్నారు.
హుస్నాబాద్: బోధన సామగ్రితో విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల ప్రతి అంశం సులువుగా అర్థమవుతుందని ఎంఈఓ బండారి మనీల అన్నారు. మండల వనరుల కేంద్రం ఆధ్వర్యంలో సోమవారం మండల స్థాయి టీఎల్‌ఎం (టీచింగ్, లర్నింగ్, మెటీరియల్) మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు వివిధ ఎగ్జిబిట్లను ప్రదర్శించారని తెలిపారు. 52 మంది ఉపాధ్యాయులు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేలా ఎగ్జిబిట్లను తయారు చేసి, విద్యార్థులకు అవగాహన కల్పించారన్నారు. ఇందులో పది ఎగ్జిబిట్లను ఎంపిక చేసి జిల్లా టీఎల్‌ఎం మేళాకు పంపించనున్నట్లు ఎంఈఓ తెలిపారు.

రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు

రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు

రాకపోకలకు ఇబ్బందులు ఉండొద్దు