
గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూపుల గోల
● రెండు వర్గాలుగా చీలిన వైనం
● పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులు
గజ్వేల్: గజ్వేల్ కాంగ్రెస్‌లో గ్రూపుల గోల తారాస్థాయికి చేరుకున్నది. ఈనెల 3వ తేదీన పట్టణంలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో తనను కులంపేరుతో దూషించి దాడి చేశారని కొండపాకకు చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు.. డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఈనెల 15న సిద్దిపేటలోనూ అట్రాసిటీ కేసు నమోదైంది. అనంతరం గజ్వేల్ కాంగ్రెస్ నర్సారెడ్డి వర్సెస్ ఆయన వ్యతిరేక వర్గీయులుగా కార్యకలాపాలు సాగుతున్నాయి. ఆదివారం విజయ్‌కుమార్ సహా కొందరు నేతలు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవిని కలసి నర్సారెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణకు పార్టీ అధిష్టానం ప్రత్యేక కమిటీని నియమిస్తునట్లు వార్తలొచ్చాయి. తాజాగా సోమవారం విజయకుమార్‌పై నర్సారెడ్డితోపాటు మాజీ కార్పొరేషన్ చైర్మన్లు భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, నియోజకవర్గంలోని మార్కెట్ కమిటీ చైర్మన్‌లు నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయమోహన్ తదితరులు హైదరాబాద్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. గత గజ్వేల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్‌కుమార్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం పనిచేశారని, ఎంపీ ఎన్నికల్లో రఘునందన్‌రావుకు అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదు చేశారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జైభీమ్, జై బాపు, జై సంవిధాన్ కార్యక్రమాల్లోనూ విజయ్‌కుమార్ పాల్గొనలేదని తెలిపారు. అలాగే.. భూకబ్జాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. మొత్తానికి రెండు వర్గాల ఫిర్యాదుల పర్వం ప్రస్తుతం హాట్‌టాపిక్ మారింది. గ్రూపుల కట్టడికి అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనే అంశంపైనే ప్రస్తుతం అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్నది.