
అప్రమత్తంగా ఉండండి
సీపీ అనురాధ
మిరుదొడ్డి(దుబ్బాక): అకాల వర్షాల పట్ల ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు. మండల పరిధిలోని అల్వాల శివారులోని కూడవెల్లి లోలెవల్ బ్రిడ్జి పైనుంచి ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వరదను సోమవారం ఆమె పరిశీలించారు. వాగుకిరువైపులా దారులను మూసివేసి బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు.ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వాగులను ఎవ రూ దాటే ప్రయత్నం చేయవద్దని సీపీ అన్నారు. ఆమె వెంట సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, దుబ్బాక సీఐ రవీందర్‌రెడ్డి ఉన్నారు.
పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ
ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించాలని సిద్దిపేట సీపీ అనురాధ పోలీస్ అధికారులను ఆదేశించారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను, సీజ్ చేసిన వాహనాలను, రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.