
మూణ్నాళ్లకే పగుళ్లు
● గోడల నుంచి లీకవుతున్న వర్షం నీరు
● నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు
● రూ.17 కోట్లు వెచ్చించినా నిష్ఫలమే..
దుబ్బాకటౌన్: పట్టణంలో నిర్మించిన సమీకృత కార్యాలయాల సముదాయ భవనం (ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్.. ఐఓసీ)లో మూణ్నాళ్లకే పగుళ్లు ఏర్పడ్డాయి. నాణ్యత లోపించి పెచ్చులూడుతోంది. 2023 అక్టోబర్ నెలలో నాటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా భవనాన్ని ప్రారంభించారు. ఈ భవన నిర్మాణానికి రూ.17కోట్లు వెచ్చించారు. ప్రారంభించిన రెండేళ్లకే పగుళ్లు, పెచ్చులూడుతుండటంతో అందులో విధులు నిర్వహించేందుకు ఉద్యోగులు సైతం జంకుతున్నారు. భవన నిర్మాణం వేళ అధికారుల పర్యవేక్షణ కొరవడటంవల్లే నాణ్యత లోపించిందని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటి దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి పట్టుబట్టి నాటి సీఎం కేసీఆర్‌తో ఐఓసీ భవన నిర్మాణానికి ఎస్‌డీఎఫ్ కింద రూ.17 కోట్లు మంజూరు చేయించారు. ఐఓసీ భవాన నిర్మాణనికి 2018లో శంకుస్థాపన చేయగా పనులు నత్తనడకన సాగుతూ..వచ్చి ఐదేళ్ల నిరీక్షణ తర్వాత 2023లో అక్టోబర్ నెలలో భవనాన్ని ప్రారంభించారు.
పునాదులకే రూ.6 కోట్లకు పైగా..
పట్టణంలోని రామసముద్రం వెనుకాల 2018లో 4 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం ప్రారంభించారు. నిర్మాణ స్థలం పూర్తిగా చెరువు వెనుకాల ఉండడం, జాలు భూమి కావడంతో కేవలం పునాదులకే రూ.6 కోట్ల నిధులు ఖర్చయ్యాయని అధికారులు చెప్పారు. ఉప ఎన్నికల్లో గెలిచిన రఘునందన్ రావు సైతం పలుమార్లు భవన నిర్మాణ పనులు పరిశీలించి నత్తనడకన సాగుతున్న పనులను వేగిరం చేయించి రూ.15 కోట్లతో కింది అంతస్తును పూర్తి చేయించారు.
ప్రస్తుతం 3 శాఖలు
ఐఓసీలో ప్రస్తుతం తహసీల్దార్, అటవీ శాఖ, పీఆర్ ఏఈ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. తహసీల్దార్ కార్యాలయానికి వివిధ సమస్యలపై, రిజిస్ట్రేషన్లకు వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కార్యాలయానికి లోపలికే వెళ్లు దారిలో భవనం పెచ్చులూడి వర్షం పడితే నీళ్లు వచ్చి గోడలు తేమ వస్తున్నాయి. బయటే కాకుండా తహసీల్దార్ కార్యాలయం లోపల పలు గదులు బీటలు వారి పగుళ్లు వచ్చాయి. అలాగే అటవీ శాఖ కార్యాలయంలో సైతం బీటలు రావడంతో నాణ్యతపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
లోపించిన నాణ్యత
కాంట్రాక్టర్ సరైన నాణ్యత ప్రమాణాలు పాటించ పోవడంతో పిల్లర్లు, గోడలు బీటలు వారి వర్షానికి నీళ్లు వస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. రూ.17 కోట్లతో మొదటి అంతస్తు మాత్రమే నిర్మిస్తే గోడల పెచ్చులూడడంమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించకుండా అధికారులు సదరు కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లిస్తారని ఆరోపిస్తున్నారు. భవనంలో విద్యుత్ సౌకర్యాలు సైతం సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి.
మరమ్మతులు చేయిస్తాం
ఇటీవల నీరు లీకై న ప్రదేశాలను పరిశీలించాం. సదరు కాంట్రాక్టర్ మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా సమస్య పరిష్కరిస్తాం.
– మహ్మద్ రిజ్వాన్,
ఏఈఈ పీఆర్, దుబ్బాక

మూణ్నాళ్లకే పగుళ్లు

మూణ్నాళ్లకే పగుళ్లు

మూణ్నాళ్లకే పగుళ్లు