
డీసీసీ అధ్యక్షుడిపై అట్రాసిటీ కేసు
సిద్దిపేటఅర్బన్: జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సారెడ్డిపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఇటీవల ఇన్‌చార్జి మంత్రి పర్యటనలో భాగంగా గజ్వేల్‌లో నర్సారెడ్డి.. సొంత పార్టీ ఎస్సీసెల్ నాయకుడిపై చేయి చేసుకున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సెల్ నాయకులు నర్సారెడ్డి తీరుపై నిరసన తెలుపుతున్నారు. పంద్రాగస్టు రోజు సిద్దిపేట డీసీసీ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణకు వచ్చిన నర్సారెడ్డికి మరోసారి నిరసన ఎదురైంది. జెండా ఆవిష్కరణ ముగించుకుని తిరిగి వెళ్తున్న సందర్భంలో జిల్లా అధ్యక్షుడి వాహనం ఎదుట పార్టీ ఎస్సీ సెల్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంలో పార్టీకి చెందిన దళిత మహిళను కులం పేరుతో దూషించాడని ఆమె సిద్దిపేట త్రీ టౌన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నర్సారెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తనను అడ్డుకున్నారని నర్సారెడ్డి కౌంటర్ ఫిర్యాదు ఇవ్వడంతో నలుగురిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.