
యూరియా కోసం అరిగోస
మిరుదొడ్డి(దుబ్బాక): యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. ఉదయం పొద్దు పొడవక ముందే యూరియా కోసం దుకాణాల వద్దకు పరుగులు పెడుతున్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని పీఏసీఎస్ కేంద్రానికి యూరియా వచ్చిందని తెలియడంతో పెద్ద ఎత్తున బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ టోకెన్లు ఇస్తుండటంతో గందర గోళం నెలకొంది. యూరియా నిలువలు తక్కువగా ఉండటంతో తమదాకా అందుతాయోలేదోనంటూ రైతులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. పోలీసుల సమక్షంలో ఒక్కో రైతు ఆధార్‌పై రెండు యూరియా బస్తాలను కేటాయిస్తూ పంపిణీ చేశారు. దీంతో కొందరికి అర కొరగా యూరియా బస్తాలు లభించగా చాలా మంది రైతులకు యూరియా దొరకక పోవడంతో నిరాశగా వెనుదిగిరిగి వెళ్ళిపోయారు. యూరియా కొరత ఏర్పడుతుండటంతో ప్రభుత్వంతో పాటు, అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చెప్యాల చౌరస్తా వద్ద ఆందోళన
యూరియా కొరత ఏర్పడటంతో రైతులు చెప్యాల చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. యూరియాను సకాలంలో అందించాలని డిమాండ్ చే స్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ అధికారులు, పోలీసులు ఆందోళన వద్ధకు చేరుకుని సకాలంలో యూరియా పంపిణీ చేస్తామని నచ్చజెప్పడంతో రైతులు అందోళన విరమించారు. ఆందోళనకు దిగిన రైతులకు ఎమ్మెల్యే మద్దతుగా నిలిచారు.
ప్రభుత్వం విఫలం: ఎమ్మెల్యే
తొగుట(దుబ్బాక): రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని వెంకట్రావుపేటలో యూరియా కోసం శుక్రవారం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడి యూరియా కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సకాలంలో రైతులకు యూరియా అందక పోతే పంటల దిగుబడి ఎలా వస్తుందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు లేక పోవడం సిగ్గుచేటన్నారు.
చెప్యాల చౌరస్తా వద్ద రైతుల ఆందోళన