
కొలువులు రావాలి.. సంపద పెరగాలి
పేదరికం తగ్గాలి.. నాణ్యమైన విద్య అందించాలి
● స్వదేశీకి ప్రాధాన్యత ఇవ్వాలి ● పరిమిత రంగాలలోనే రిజర్వేషన్లు వర్తింపజేయాలి ● ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి ● ‘వందేళ్ల భారతం’పై విద్యార్థుల మనోభావాలు
బానిస సంకెళ్లు తెంచుకొని పరాయి పాలన నుంచి విముక్తి పొందిన మన దేశం.. 78 ఏళ్లల్లో ఎంతో పురోగతి చెందింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిందా? పరిపాలన ఎలా సాగుతోంది? ఇంకా ఎలా ఉండాలి? టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, నిరుద్యోగం వంటి అంశాలపై గురువారం పొన్నాలలోని ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో సీఎస్‌ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులతో ‘సాక్షి’ టాక్ షో నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలనే విషయాలను పంచుకున్నారు.
సిద్దిపేటఅర్బన్
ఆర్థికంగా బలపడితేనే..
దేశంలో నిరుద్యోగం పెరుగుతోంది. చదువుకు తగిన ఉద్యోగాలు లేకపోవడంతో విదేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతోంది. దేశంలో ఎక్కువ సంఖ్యలో యువత ఉన్నప్పటికీ అభివృద్ధిలో వెనకబడిపోతున్నాం. క్వాలిటీ ఎడ్యుకేషన్‌ను అందిస్తే ఆటోమేటిక్‌గా అన్ని రంగాలలో మెరుగవుతాం. ఆర్థికంగా బలపడితే పేదరికం తగ్గి దేశ సంపద పెరుగుతుంది.
– సత్యనారాయణ, సీఎస్‌ఈ ఫైనలియర్ విద్యార్థి
రాజకీయ పదవులకు అర్హత ఉండాలి
ఏ ఉద్యోగానికి అయినా కనీస విద్యార్హత, నైపుణ్యాలు వంటివి పరిగణనలోకి తీసుకుంటారు. కానీ పరిపాలన అందించే వారికి, రాజకీయ పదవులకు ఎలాంటి అర్హతలు లేకపోవడం వల్ల ఇంకా వెనకబడి పోతున్నాం. రాజకీయ పదవులకు కూడా కనీస అర్హతలు పెట్టాలి. ఉన్నత చదువులలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల చాలా మంది ఇతర దేశాలకు వెళ్లి చదువుకొని అక్కడే స్థిరపడిపోతున్నారు. దీని వల్ల మైగ్రేషన్ పెరిగి దేశాభివృద్ధికి సాయపడే వారు తగ్గిపోతున్నారు.
–నవ్య, సీఎస్‌ఈ ఫైనలియర్ విద్యార్థిని
స్టడీస్‌లో అడ్వాన్స్ టెక్నాలజీని చేర్చాలి
ప్రస్తుతం ఉన్న సిలబస్ అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే విధంగా లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అడ్వాన్స్ టెక్నాలజీని సిలబస్‌లో చేర్చాలి. హెల్త్ కేర్ రంగాలలో ప్రైవేట్ వారిదే ఆధిపత్యంగా ఉంది. వైద్య రంగంలో ప్రభుత్వం ఆధిపత్యం సాధించాలి. ప్రకృతిని కాపాడుకుంటూ టెక్నాలజీని విస్త్ర ృత పరచుకోవాలి.
–సాయిప్రవర్షిణి,
సీఎస్‌ఈ ఫైనలియర్ విద్యార్థిని
ఉద్యోగాల కల్పనపై దృష్టి సారించాలి
దేశం ఇంకా అభివృద్ధి చెందాలంటే ఇండస్ట్రీస్ ఎక్కువగా రావాలి. ప్రభుత్వం ఇండస్ట్రీల ఏర్పాటుకు సబ్సిడీలు ఇచ్చి కంపెనీలు నెలకొల్పేలా చేయూత ఇవ్వాలి. మత ఘర్షణ లు ఆపి ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టాలి. అనవసరమైన వాటి కోసం ఉచితాలు ఇవ్వకుండా దేశాభివృద్ధికి దోహదపడే వాటికే ఉచితాలు ఇచ్చే విధంగా నాయకులు ఆలోచన చేయాలి.
–ఖాజా హుస్సేన్,
సీఎస్‌ఈ ఫైనలియర్ విద్యార్థి
కొన్ని రంగాల వాటికే..
ప్రతి రంగంలో రిజర్వేషన్లు వర్తింపజేయడం వల్ల క్వాలిటీ, కంటెంట్ ఉన్న వారు ప్రైవేట్ రంగంలో స్థిరపడిపోతున్నారు. దీని వల్ల ప్రభుత్వ వ్యవస్థలు వెనకబడిపోతున్నాయి. ఎడ్యుకేషన్ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఉద్యోగాలలో ఇవ్వడం వల్ల దేశానికి నష్టం జరుగుతోంది. ప్రభుత్వ పరంగా ఇండస్ట్రీస్ పెరగాలి. ఉద్యోగాల కల్పన ఎక్కువ మొత్తంలో కల్పించే విధంగా మార్పు రావాలి.
–అఖిల్,
సీఎస్‌ఈ ఫైనలియర్ విద్యార్థి