
యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్న
హబ్షీపూర్ వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో
దుబ్బాక: యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. హబ్షీపూర్ చౌరస్తాలో గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. వందలాది మంది రైతులు ఆందోళనకు దిగడంతో ఎల్కతుర్తి–మెదక్ జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ కీర్తిరాజులు బలవంతంగా రైతులను అక్కడినుంచి పంపించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. రైతులు మాట్లాడుతూ యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల నిరీక్షణ
నంగునూరు(సిద్దిపేట): పాలమాకుల పీఏసీఎస్‌కు గురువారం యూరియా వస్తోందని ప్రచారం జరగడంతో తెల్లవారుజాము నుంచే రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చాల సేపటి నుంచి నిరీక్షించిన యూరియా రావడం ఆలస్యం కావడంతో చెప్పులు క్యూలైన్‌లో పెట్టారు. యూరియా ఇవ్వడం ప్రారంభించగానే ఒక్కసారిగా లోపలికి చొచ్చుకొని రావడంతో గందరగోళం ఏర్పడింది.
కొరత తీరేవరకు పోరాటం
గజ్వేల్: యూరియా కొరత తీర్చేంతవరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. గురువారం ఇందిరాపార్కు చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేపట్టగా వారి ఆందోళనకు ప్రతాప్‌రెడ్డి మద్దతు పలికి బైఠాయించారు. ఆయన మాట్లాడుతూ సకాలంలో యూరియా అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.