
అత్యాధునిక బోధనే లక్ష్యం కావాలి
● ఇంజనీరింగ్ కళాశాల ఆదర్శంగా నిలవాలి ● ఫోన్‌లో మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్ ● మొదటి ఏడాది తరగతులు ప్రారంభం
హుస్నాబాద్: శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యా బోధన అత్యుత్తమంగా ఉండాలని, ఆ విషయంలో రాజీ పడవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం పట్టణ శివారు కిషన్ నగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం తరగతులను కలెక్టర్ హైమావతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం హైదరాబాద్ నుంచి ఫోన్‌లో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. హుస్నాబాద్ నాలుగు జిల్లాల పరిధిలో ఉందని, ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కళాశాల స్ధాపనకు తనతో పాటు కలెక్టర్, వైస్ చాన్స్‌లర్ ఎంతో కృషి చేశారన్నారు. కళాశాలలో అధునాతనమైన వసతులు కల్పించడం నా బాధ్యత అన్నారు. కళాశాలలో అధ్యాపకులు, స్టాఫ్ నియామకంలో రాజకీయ జోక్యం లేకుండా అంతా యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కే అప్పగించామన్నారు. కళాశాల నిర్మాణం కోసం 35 ఎకరాల భూమిని కేటాయించామని, త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారన్నారు. అకాడమిక్ విద్యా ప్రమాణాలతో ఇతర కళాశాలతో పోటీ పడి చదువు చెప్పాలని అద్యాపకులకు సూచించారు. మొదటి బ్యాచ్ విద్యార్ధులే ఈ కళాశాలకు అంబాసిడర్లు అని మంత్రి అన్నారు.
ఆధునిక వసతులు కల్పిస్తాం: కలెక్టర్
ఇంజనీరింగ్ కళాశాలలో ఆధునిక వసతులు కల్పిస్తామని కలెక్టర్ హైమావతి తెలిపారు. జిల్లా పరిపాలన తరపున అన్ని సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే హుస్నాబాద్‌లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కళాశాల కోసం స్థలం పరిశీలించాలని మంత్రి కోరారని తెలిపారు.
విద్యార్థులు ఇష్టపడి చదవాలి
విద్యార్థులు ఇష్టపడి చదివి రాష్ట్రంలోనే నంబర్ వన్ కళాశాలగా పేరు తేవాలని వైస్ చాన్స్‌లర్ ఉమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, ప్రాక్టికల్ గదులు, అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. అత్యాధునికమైన విద్యను అందించడానికి కృషి చేస్తున్నామన్నారు. కళాశాలలో చదివే విద్యార్థులు జాబ్‌తోపాటే బయటకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ రవి కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శివయ్య తదితరులు పాల్గొన్నారు.